ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కష్ణా పరివాహక ప్రాంతంలో పులిచింతల, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో పెరగడంలేదు. దీంతోఈ ఏడాది సాగర్ ఆయకట్టులో ఖరీఫ్ సేద్యం ప్రశ్నార్ధకంగా మారింది. ప్రభుత్వం ఇంతవరకు ప్రత్యామ్నాయంపై దృష్టి సారించలేదు. గతేడాది ఆగస్టు 11వ తేదీ నాటికి శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్న నీటినిల్వలకు ప్రస్తుత పరిస్థితికి చాలా వ్యత్యాసం కన్పిస్తోంది. దీంతో ఈ ఏడాది నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో వరి సాగుకు నీరిస్తారా? లేదా? అనేది అప్పుడే చెప్పలేమని జలవనరుల శాఖ అధికారులు అంటున్నారు. దీంతో మెట్ట పంటలు మాత్రమే సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాటికైనా నీరు అందుతుందా అనే సందేహం రైతుల్లో ఏర్పడింది. ప్రధానంగా రెండు లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన మిర్చిపంటకు కూడా ఇంకా స్పష్టత రావడం లేదు.
కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ కోసం నిర్మించిన పులిచింతల జలాశయంలో గరిష్ట నిల్వ 45.77 టీఎంసీలు కాగా శుక్రవారం 31.46 టీఎంసీలు మాత్రమే ఉంది. గతేడాది ఇదేరోజుకు పులిచింతలలో 38.18 టీఎంసీలు నిల్వ ఉంది. పులిచింతల నుంచి 9 వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజికి విడుదల చేస్తున్నారు. పులిచింతలకు ఆగస్టు చివరి నాటికి వరద నీరు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నాగార్జునసాగర్‌లో గరిష్ట నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 144.44 టీఎంసీలే ఉంది. గతేడాది ఇదేరోజుకు 304.99 టీఎంసీలుంది. శ్రీశైలంలో గరిష్ట నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 122.12 టీఎంసీలు ఉండగా గతేడాది ఇదేరోజుకు 213.4 టీఎంసీలున్నట్లు అధికారులు తెలిపారు.
ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఆశించిన స్థాయిలో నీరు రావడంలేదు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు దాదాపుగా నిండాయని, వచ్చే పది రోజుల్లో ఆల్మట్టికి వరద ప్రవాహం బాగావస్తే శ్రీశైలానికి ఇన్‌ఫ్లో బాగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తూర్పు డెల్టాకు 7209 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 3949 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్‌కు 44 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తం 11,202 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజినుంచి కాల్వలకు వినియోగిస్తున్నారు.
డెల్టాపరిధిలో వరిసాగుకు ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజి ద్వారా నీటి సరఫరాకు ఇబ్బంది లేకపోయినా నాగార్జునసాగర్‌లో మాత్రం సందిగ్ధత కొనసాగుతోంది. ప్రధానంగా సాగర్ ఆయకట్టులో మిర్చికి కనీసం రెండు నుంచి మూడు తడులు ఇవ్వాల్సి ఉంది. దీంతో రైతులు మిర్చిసాగుపై ఇంకా అయోమయంలోనే ఉన్నారు. వర్షాలు మందగించడంతోపాటు సాగర్ కాల్వల నుంచి సాగుకునీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం వల్ల సందిగ్ధత కొనసాగుతోంది.










