Sep 07,2023 20:31

కెసి కెనాల్‌ ఆయకట్టు పరిధి

 చాపాడు సెప్టెంబర్‌ మెదటి వారం పూర్తి కావస్తున్నా కెసి కెనాల్‌ ఆయకట్టు పరిధికి నీరు విడుదల కాకపోవడంతో ఖరిఫ్‌లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారినది. కర్ణాటక, మహారాష్ట్రలలో సకాలంలో వర్షాలు పడకపోవడంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీరు ఇప్పటికి పూర్తి స్థాయికి నోచుకోలేదు. స్థానికంగా రాజోళి ఆనకట్ట వద్ద నీరు ఉన్నా ఖరీఫ్‌కు సరిపోవన్న కారణంతో కాలువకు నీరు విడుదల చేయలేదు. ప్రస్తుతం రాజోలి ఆనకట్ట ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటంతో కుందూనది ఉధృతంగా ప్రవహిస్తోంది. వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా సోమశిలకు వెలుతున్నా కెసికి నీరు ఇవ్వడంలో పాలకుల, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాజోలి ఆనకట్ట పెంపుపై నిర్లక్ష్యం కొనసాగుతుండటంతో ఏళ్ళు గడుస్తున్నా నిర్మాణం ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం కెసి పరిధిలో పచ్చని పైరుతో ఉండాల్సిన సందర్బంలో ఎడారిని తలపించే బీడు భూములు దర్శనిమిస్తున్నాయి.
రాజోలి ఏర్పాటులో నిర్లక్ష్యం...
జిల్లాలోని లక్షలాది మంది రైతుల గుండె సవ్వడి ప్రవాహమే కెసి కెనాల్‌. జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా సాగునీరు అందిస్తున్న ఒక పెద్ద ప్రాజెక్టు. రాజోలి ఆనకట్ట, కెసి కాలువ ద్వారా జిల్లాలోని రాజుపాలెం, దువ్వూరు, ప్రొద్దుటూరు, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట, వల్లూరు, చెన్నూరు, కడప మండలాల్లో 92 వేల ఎకరాలలో సాగు భూమి ఉంది. ప్రస్తుతం వరి, పసుపు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, మినుము ఇతర పంటలను దేశానికి ఎగుమతి చేసే దిశగా కెసి కెనాల్‌ ప్రాంత రైతులు ఉన్నారు. కెసి కెనాల్‌కు ప్రతి సంవత్సరం నీరు వస్తుందా లేదా అని సందిగ్ధంలో రైతులు ఉంటున్నారు. 2019 డిసెంబర్‌ 23న ముఖ్యమంత్రి జగన్‌ రాజోలి ఆనకట్టను 2.95 టిఎంసిల సామర్థ్యంతో సుమారుగా రూ.800 కోట్లకు పైగా నిధులు వెచ్చించి నిర్మించే ప్రాజెక్టు భూమిపూజ చేశారు. నాలగేళ్లు పూర్తి కావస్తున్నప్పటికీకి పురోగతి లేదు. వర్షపు నీరు నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో కుందూ వరద నీరు పెన్నా ద్వారా సోమశిల ప్రాజెక్టులోకి ప్రతి ఏడాది లక్షల క్యూసెక్కుల నీరు తరలివెళుతోంది. రాజోలు ఆనకట్ట పెంపుదల చేస్తే ఈ నీటిని నిల్వ ఉంచి కెసి కెనాల్‌కు మళ్లించడం ద్వారా రైతులు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది.
కెసికి వాటా ఇవ్వడంలో జాప్యం..
శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు చేరగానే కెసి కాలువకు నీరు విడుదల చేయాలని జిఒ చేశారు. ప్రస్తుతం 884 అడుగులకు నీరు చేరితే మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. 854 అడుగుల జిఒ అమలుకు నోచుకోకపోవడంతో కెసి కాలువకు నీరు చేరే పరిస్థితి లేదు. నీరు విడుదల అయినప్పటికీ అవి ఎప్పటి వరకు వస్తాయనేది అధికారులకే తెలియని పరిస్థితి. ఒకవేళ విడుదల చేసినా సెప్టెంబర్‌, జనవరి మధ్యలో విడుదల చేస్తున్నారు. ఆగస్టు నుంచి ఏప్రిల్‌ చివరి వరకు విడుదల చేస్తే రెండు దఫాలుగా పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో కెసి కాలువ కింద ఖరీఫ్‌, రబీలలో రెండు సార్లు పంటలు పండించుకునే రైతులు సస్యశ్యామలంగా ఉండాలంటే రాజోలి ఆనకట్ట ఎత్తు పెంపు వీలైనంత త్వరగా నిర్మించాల్సి ఉంది. లేనిపక్షంలో కెసి కాలువకు సకాలంలో నీరు రావడం ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు.
జిల్లా వ్యాప్తంగా తగ్గిన సాగు...
కడప జిల్లాలోని 36 మండలాల్లో వార్షిక వర్షపాతం 699 మిల్లీమీటర్లు కాగా నైరుతి రుతుపవరాల సాధారణ వర్షపాతం 403.3 మిల్లీమీటర్లు. ఇప్పటి వరకు వర్షపాతం 156.2 మీ.మీ. గాను 108.2 మీ.మీ వర్షపాతం నమోదైనది. 30.5 శాతం తక్కువగా నమోదైనది. జిల్లాలో పంటల విస్తీర్ణం ఖరీఫ్‌ సీజన్‌లో 2023 వివిధ రకాల పంటల సాధారణ విస్తీర్ణం 77,128 హెక్టార్లు కాగా ఇందులో 11,465 హెక్టార్లు మాత్రమే వివిధ పంటల సాగు చేసినట్లు తెలుస్తున్నది.
వరి సాగుపై ఆసక్తి ఉన్నా లేని అవకాశం
గత ఖరీఫ్‌, రబీ సీజన్‌లో సాగు చేసిన వరి ధాన్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ధరలు రోజు రోజుకు పెరుగుతూ పుట్టి (బస్తాలు) రూ.23 వేలకు చేరుకున్నాయి. డిసెంబర్‌ నెలలో వరి నూర్పిడి పనులు చేపట్టిన సమయంలో పుట్టి(8 బస్తాల) ధర రూ.12 వేల వరకు పలికాయి. ఆ తర్వాత జనవరిలో రూ.13 వేలకు ధరలు చేరుకున్నాయి. ప్రస్తుతం రూ.21 వేల వరకు చేరుకున్నాయి. గత ఏడాది సాగైన వరి ధాన్యం రూ.23 వేల వరకు పలికాయి. ఈ ఏడాది వరి సాగుకు ఆసక్తి కనపరుస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో సాధారణంగా కెసిి, కుందూ, బ్రహ్మసాగర్‌, మైలవరం, గండికోట, పలు చెరువుల కింద వరి పంటను అత్యధికంగా సాగు చేసేవారు. రెండు లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో వరి పంటను సాగు చేసేవారు. గత ఏడాది 50 వేల ఎకరాల వరకు సాగు తగ్గడానికి సరైన మద్దతు ధరలేకపోవడమే. ఈ ఏడాది సాగు చేపడదామనుకున్న తరుణంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా సాగు పూర్తిగా తగ్గింది.
వరి సాగుకు ఏర్పాట్లు చేసుకున్నాం
పది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి పంట సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాను. పచ్చిరొట్ట ఎరువులు సాగు చేపట్టి విత్తన వడ్లు కూడా కొనుగోలు చేసి సిద్దంగా ఉంచుకున్నాం. కెసి కాలువకు నీరు రాకపోవడంతో ప్రస్తుతం జీలగ పంటను తొలగించి ఆరుతడి పంటల సాగుకు చర్యలు చేపడుతున్నాము. ఇప్పటి వరకు ఎకరాకు దుక్కిళ్ళు, విత్తన సాగుకు రూ.3వేలు ఖర్చలు వచ్చాయి.
- భాస్కర్‌రెడ్డి, విశ్వనాధాపురం, చాపాడు.
కెసి రైతులను ఆదుకోవాలి
కెసి పరిధిలోని రైతులు వరి పంటకు అవసరమైన ఏర్పాట్లు చేసుకొని ప్రస్తుతం నీరు విడుదల కాకపోవడంతో జీలగ పంటను దుక్కిళ్ళు చేపడుతున్నారు. రాజోలి ఆనకట్ట నిర్మాణం చేపట్టకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం వలనే కెసి రైతులకు ఇలాంటి దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కుందూలో వర్షపు నీరు వృథాగా సోమశిలకు వెలుతుంది తప్ప కడప జిల్లా ప్రజలకు ఏమాత్రం మేలు జరగడం లేదు. వరి సాగుకు ఏర్పాట్లు చేసుకోని నష్టపోయిన రైతులకు ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయాలి.
- జి.శివకుమార్‌, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు.