Dec 03,2022 23:52

మాట్లాడుతున్న వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు

ప్రజాశక్తి-బుచ్చయ్యపేట : గ్రామ పంచాయతీల బిల్లులు మంజూరులో ట్రెజరీ అధికారులు పర్సంటేజ్‌ డిమాండ్‌ చేయడం తగదని వైసిపి మండల నాయకులు, సర్పంచ్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మాడుగుల సబ్‌ ట్రెజరీ అధికారులు బుచ్చయ్యపేట మండలంలోని 35 గ్రామపంచాయతీ నుండి బిల్లుల కోసం సబ్‌ ట్రెజరీకి బిల్లులు సమర్పిస్తే 2 శాతం పర్సంటేజ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గ్రామ సర్పంచ్‌లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ సమావేశంలో వైసిపి మండల అధ్యక్షులు కొల్లిమల్ల అచ్చం నాయుడు, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ, దిబ్బిడి సర్పంచ్‌ పెద్దిరెడ్డి మాణిక్యం, ఆర్‌.శివరామపురం సర్పంచ్‌ నమ్మి అప్పలరాజు, వైసిపి మండల నాయకులు దాకారపు నాగరాజు, వైస్‌ ఎంపిపి గొంప వెంకటేశ్వర రాజు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.