Aug 20,2023 00:43

సిపిఎం బలపరచిన అభ్యర్థిని అభినందిస్తున్న స్థానికులు

ప్రజాశక్తి -యంత్రాంగం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఇందుకు గాను అధికారులు ముందస్తుగా ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు చోట్ల సిపిఎం బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు.
సిపిఎం బలపరచిన అభ్యర్థి విజయం
మోతుగూడెం: చింతూరు మండలం గూడూరు ఐదోవార్డు స్థానానికి శనివారం జరిగిన ఉప ఎన్నికలో సిపిఎం బలపరిచిన అభ్యర్థి సోడే సూరయ్య మంచి మెజార్టీతో ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి కర్ణం ముత్తయ్యపై 24 ఓట్లు మెజారిటీ తో విజయం సాధించారు. గూడూరు ఐదో వార్డులో 92 ఓట్లు పోలింగ్‌ జరగగా , సిపిఎం అభ్యర్థికి 56 ఓట్లురాగా, ప్రత్యర్థి వైసిపి అభ్యర్థికి 24 ఓట్లు వచ్చాయి. 12 ఓట్లు చెల్లలేదు. వార్డు సభ్యునిగా విజయం సాధించిన సూరయ్యను సిపిఎం మండల కార్యదర్శి సీసం సురేష్‌, కమిటీ సభ్యులు పొడియం లక్ష్మణ్‌, మడకం రమేష్‌, గూడూరు శాఖ సభ్యులు నగేష్‌, మాధవి, బాడిస శేషు, బానిస భూమిక, మడకం నాగేష్‌, రాములమ్మ సీత తదితరులు అభినందించారు.
ఈ సందర్భంగా సురేష్‌ మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సిపిఎం బలపరిచిన అభ్యర్థిని గెలిపించిన ఓటర్లు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.కొత్తపల్లిలో వైసిపి అభ్యర్థి కారం సుబ్బమ్మ గెలిచారు.
వైసిపి అభ్యర్ధి సీతారత్నం గెలుపు
రంపచోడవరం : డివిజన్‌ పరిధిలోని రంపచోడవరం మండలంలోని బండపల్లి పంచాయతీ 2వ వార్డు సభ్యునికి జరిగిన ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి పారా సీతారత్నం టిడిపి అభ్యర్థిపై నాలుగు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
నడింపాలెంలో టిడిపి, మాకవరం, రేవళ్లలో వైసిపి విజయం
కొయ్యూరు: మండలంలో నడింపాలెం, పి. మాకవరం, రేవళ్లు పంచాయతీల్లో వార్డు సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. నడింపాలి వార్డు సభ్యురాలిగా టిడిపి అభ్యర్థి చెడ్డా లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలలో పి మాకవరం వార్డ్‌ సభ్యురాలిగా వైసిపి బలపరిచిన నర్సి పద్మలత 63 ఓట్లతో గెలుపొందారు.
రేవళ్లు పంచాయతీలో ఎన్నికలు జరిగినప్పటికీ, టిడిపి ఓట్లను ఉద్దేశపూర్వకంగానే వైసిపి నేతలు గల్లంతు చేసారని ఆరోపణతో ఓటింగ్‌ను తెలుగుదేశం అభ్యర్థి బహిష్కరించారు. అయినప్పటికీ ఎన్నిక నిర్వహించగా, మొత్తం 139 ఓట్లలో 76ఓట్లు పోలవ్వగా టిడిపి అభ్యర్థికి ఆరు, నోటాకు ఒక ఓటురాగా, 69ఓట్లు సాధించిన వైసిపి అభ్యర్థి గోట్టుపల్లి బాల రాజులమ్మ 63ఓట్ల తేడాతో విజయం సాధిచారు.
సీలేరు సర్పంచ్‌గా దుర్జో విజయం
సీలేరు: సీలేరు మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ ఉప ఎన్నికలో వైసిపి, కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థి పాంగి దుర్జు 567 ఓట్లు సాధించి ఘన విజయం సాధించారు. సీలేరు సర్పంచ్‌ కొర్ర పరదేశి అకాల మరణంతో ఉప ఎన్ని నిర్వహించగా, వైసిపి, కాంగ్రెస్‌ అభ్యర్థి పాంగి దుర్జు, టిడిపి అభ్యర్థి దశరద్‌ బిజెపి అభ్యర్థి పాంగి సుమిత్ర పోటీ పడ్డారు. 1089 ఓట్లు పోలవ్వగా, పాంగి దుర్జు సమీప టిడిపి అభ్యర్థి దశరథపై 140 ఓట్లు మెజారిటీతో విజయం సాధించారు. టిడిపి అభ్యర్థి దశరధ్‌కు 427 ఓట్లు సాధించగా, బిజెపి అభ్యర్థి పాంగి సుమిత్రకు కేవలం 65 ఓట్లు వచ్చాయి. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సత్యనారాయణ ధ్రువీకరణ పత్రాన్ని దుర్జోకు అందజేశారు. జీకే వీధి సిఐ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత కల్పించారు.
వైసిపి, కాంగ్రెస్‌్‌ శ్రేణుల్లో ఆనందోత్సవాలు
వైసిపి, కాంగ్రెస్‌ ఉమ్మడి అభ్యర్థి దుర్జో విజయంతో ఆయా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. వైసిపి మండల నేతలు బొబ్బిలి లక్ష్మణ్‌, ఎంపిపి బి. కుమారి ఎంపిటిసి పిల్ల సాంబమూర్తి, కాంగ్రెస్‌ నేతలు కారే. శ్రీనివాస్‌ ఎం సత్తిబాబు దుర్జోను. పూలమాలలు వేసి, ఊరేగించి అభినందనలు తెలిపారు.కాగా తనను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని దుర్జో వెల్లడించారు. విజయోత్సవ ర్యాలీలో దారకొండ ఎంపిటిసి మామిడి రామన్న, సర్పంచి నడిగుట్ల రాజు వైసీపీ నాయకులు బుజ్జి స్వర్ణలత బుజ్జి వెంకటరావు చిరుపతి శివరాం సత్తిబాబు గణేష్‌ కాంగ్రెస్‌ నాయకులు వానపల్లి అప్పారావు బుజ్జి పాల్గొన్నారు.
పెదబయలు:పెదకోడాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికకు, ఇంజెరిలో జరిగిన రెండు వార్డులకు ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు సజావుగా జరిగాయి. పెదకోడాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికకు ఐదుగురు పోటీ చేయగా మొత్తం 2915 ఓటర్లకు గాను 1766 ఓట్లు పోలయ్యాయి. పెదకోడాపల్లి సర్పంచ్‌ గా బట్టి చిట్టిబాబును ఎన్నికైనట్టు అధికారులు తెలిపారు. ఇంజరిలో రెండు వార్డులకు సంబంధించి నాలుగవ వార్డులో కొర్ర విజయ 74 ఓట్లతోనూ, 12వ వార్డులో వంతాల చిలకమ్మ 61 ఓట్లతో గెలుపొందారు.
హుకుంపేట:మండలం శోభకోట గ్రామంలో పంచాయతీ ఎన్నికలు శనివారం నిర్వహించారు. టిడిపి, వైసిపి, బిజెపి, పార్టీల నుండి నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు.అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు శోభకోట గ్రామ సచివాలయంలో జరిగిన ఎన్నికల లెకింపు నిర్వహించారు. సర్పంచ్‌గా పలాసి శశిభూషణం నాయుడు 406 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఓటింగ్‌ కేంద్రాలను ఐటిడిఎ పిఓ వి అభిషేక్‌ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట్రావు, సీఐ సుధాకర్‌ తదతరులు పాల్గొన్నారు.