ప్రశాంతంగా పంచాయతీ ఉప ఎన్నికలు
81.57శాతం పోలింగ్
వైసిపి మద్దతుదార్లదే హవా
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో, యంత్రాంగం
తిరుపతి జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఓ పంచాయతీ సర్పంచి, ఏడు వార్డుల్లో శనివారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. 81.57శాతంగా పోలింగ్ నమోదయ్యింది. భారీ భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించినట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆదెం రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రతి వార్డు మెంబర్‌కు, సర్పంచి అభ్యర్థికి ఎన్నడూ లేని విధంగా గన్‌మెన్‌లను కేటాయించారు. ఈ ఎన్నికల్లో టిడిపి, వైసిపి మద్దతుదారుల మధ్య పోటీ నెలకొంది. వైసిపి మద్దతుదారులే మెజార్టీగా గెలుపొందారు.
తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం అడవికోయంబేడుకు వైసిపి మద్దతుదారు కె.కిరణ్‌కుమార్ సర్పంచిగా ఎన్నికయ్యారు. పుత్తూరు మండలం మూడో వార్డు మెంబర్‌గా వేపగుంట భారతి టిడిపి మద్దతుదారు గెలుపొందారు. పిచ్చాటూరు మండలం ఏడో వార్డు వైసిపి మద్దతుదారు ఎస్.బాలసుబ్రమణ్యం విజేతగా నిలిచారు. కోట మండలం కేశవరం గ్రామంలో వైసిపి మద్దతుదారు ఉల్లిపాయల పుల్లమ్మ గెలుపొందారు. వాకాడు మండలం కొండాపురానికి చెందిన ఏడో వార్డు వైసిపి మద్దతుదారు గిరిజ మల్లి గెలిచారు. డక్కిలి మండలంలోని ఆల్టాపాడు మొదటివార్డుకు వైసిపి మద్దతుదారు గుంటపోగుల మురళి గెలుపొందారు. అదే మండలానికి చెందిన ఐదో వార్డు వైసిపి మద్దతుదారు అభ్యర్థి నిడిగింటి చిట్టెమ్మ గెలిచారు. సిరిపురం 8వ వార్డు వైసిపి మద్దతుదారు పాలేటి చిట్టెమ్మ గెలిచారు.
వేపగుంటలో టిడిపి మద్దతుదారు
వేపగుంట మూడో వార్డు ఉప ఎన్నికలో 41 ఓట్ల తేడాతో వేపగుంట భారతి గెలుపొందారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది నాంది అని టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఎ.బాలాజీ ఆమెను గజమాలతో సత్కరించారు. టిడిపి అధ్యక్షులు డి.రవికుమార్, మాజీ మండల అధ్యక్షులు కరుణాయాదవ్, తడుకు సర్పంచి వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు.
39 ఓట్ల తేడాతో సర్పంచిగా కిరణ్‌కుమార్ గెలుపు
పిచ్చాటూరు : అడవికేశవరం పంచాయతీ సర్పంచి ఉప ఎన్నికల్లో వైకాపా మద్దతుదారు కె.కిరణ్‌కుమార్‌నాయుడు 39 ఓట్ల తేడాతో టిడిపి అభ్యర్థి ఎం.ఎస్. రవిపై విజయం సాధించారు. గోవర్ధన్‌గిరి పంచాయతీలో వైకాపా మద్దతుదారు సుబ్రమణ్యం రాజు గెలుపొందారు. అడవికోడియంబేడులో వైకాపా రాష్ట్ర కార్యదర్శి కెవి భాస్కర్‌నాయుడు సతీమణి కెవి పుష్పవతి మరణించడంతో ఉప ఎన్నికకు దారితీసింది. 1033 ఓట్లకు గాను 805 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి సుబ్బారావు తెలిపారు. కిరణ్‌కుమార్‌కు 411 ఓట్లు, టిడిపికి 371 ఓట్లు రాగా, 11 ఓట్లు చెల్లలేదు. 12 ఓట్లు నోటాకు పడ్డాయి. డిఎస్‌పి శ్రీనివాసులు బందోబస్తు నిర్వహించారు.
10 ఓట్ల మెజార్టీతో ఉల్లిపాయల పుల్లమ్మ
కోట : కేశవరం పంచాయతీలోని ఐదో వార్డులో వైసిపి మద్దతుదారు ఉల్లిపాయల పుల్లమ్మ, టిడిపి అభ్యర్థి రేవతిపై 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.










