ప్రశాంతంగా పది పరీక్షలు
జిల్లా కలెక్టర్, డిఇఒ, ఫ్లయింగ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్/బేతంచెర్ల
జిల్లాలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అనురాధ తెలిపారు. గురువారం జరిగిన సైన్స్ పరీక్షకు 24,059 విద్యార్థులకు గాను 23,749 విద్యార్థులు హాజరు కాగా, 310 మంది గైర్హాజరయినట్లు తెలిపారు. బేతంచర్ల పట్టణంలోని సెయింట్ ఆన్స్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, జిల్లా విద్యాశాఖాధికారి ఎం.అనురాధ 7 పరీక్ష కేంద్రాలను, పరీక్షల విభాగం, సహాయ కమిషనర్ గోపాల్ 4 పరీక్షా కేంద్రాలను సందర్శించి తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 5 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు 32 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు ఆమె తెలిపారు. అలాగే రాష్ట్ర పరిశీలకులు అర్.నరసింరావు 7 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. మొత్తం 51 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు డిఇఒ వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి సజావుగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.










