ప్రజాశక్తి-పాడేరు టౌన్: ఈ నెల 3 నుంచి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ నిర్వహించిన పదో తరగతి పరీక్షలు శనివారం ముగిసాయి. చివరి పరీక్ష రాసి వసతిగృహాలకు వచ్చిన విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. విద్యార్థులు ఒకరికొకరు ఆనందాన్ని పంచుకున్నారు. మళ్లీ కలుద్దామంటూ బై బై చెప్పుకున్నారు. సంతోషంతో ఇళ్ల బాట పట్టారు. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలోని ఆయా పాఠశాలల్లోని వసతి గృహాల్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థులు వస్తు సామగ్రి సర్దుకుని కుటుంబ సభ్యులతో తమ స్వగ్రామాలకు తరలి వెళ్లారు. తమ బిడ్డలను ఇళ్లకు తీసుకు వెళ్ళేందుకు పాఠశాలలకు బైకులు, ఆటోలతో వచ్చిన తల్లిదండ్రులు.. పిల్లల పెట్టెలను లగేజీలను మోస్తున్న కుటుంబ సభ్యులు.. కుమార్తెలను ఇళ్లకు తీసుకు వెళుతున్న తల్లులతో ఆయా పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొంది.
డుంబ్రిగూడ: ఈనెల మూడు నుంచి మండలంలో జరిగిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారంతో ప్రశాంతంగా ముగిసాయి. మండలంలోని 10 పాఠశాలల నుంచి చదువుతున్న విద్యార్థులకు మండల కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష నిర్వహించే సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా పరీక్షలు ముగియడంతో అటువంటి అధికారులు, పోలీసులు ఆనందం వ్యక్తం చేశారు.
హుకుంపేట:మండలంలోని పదో తరగతి పరీక్షలకు మూడు సెంట్లు ఏర్పాటు చేయగా 78 మంది విద్యార్థులు హాజరయ్యారు.15 పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇంటి బాట పట్టారు. విద్యార్థులందరూ తమ తల్లిదండ్రులతో ఇంటి బాట పట్టారు.










