Apr 15,2023 21:08

మహానంది : పరీక్షలు ముగియడంతో ఆనందంగా వెళ్తున్న విద్యార్థులు

 

ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

      జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలు శనివారం ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు పరీక్షా కేంద్రాలను డిఇఒ అనురాధ తనిఖీ చేశారు. చివరి రోజు జరిగిన సోషల్‌ పరీక్షకు 125 పరీక్షా కేంద్రాలలో 22,797 విద్యార్థులకు గాను 22,543 విద్యార్థులు హాజరు కాగా 254 మంది గైర్హాజరైనట్లు ఆమె తెలిపారు. మహానంది : మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, క్రీస్తుజ్యోతి పాఠశాలలో శనివారం ఆరవ రోజు సాంఘికశాస్త్రం పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 166 మంది విద్యార్థులకు గాను 164 మంది హాజరయ్యారని, క్రీస్తుజ్యోతి పాఠశాలలో 154 మందికి గాను 147 మంది హాజరయ్యారని సిట్టింగ్‌ స్క్వాడ్‌ కస్టోడియన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఆఖరి పరీక్ష కావడంతో దూరప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉదయం 8 గంటలకు కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షలు ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలు ముగియగానే విద్యార్థులు ఇళ్లకు హుషారుగా తరలివెళ్లారు. క్రీస్తు జ్యోతి పాఠశాల కరస్పాండెంట్‌ షిధిన్‌ శామ్యూల్‌ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని, మొదటిసారి పాఠశాలకు పదో తరగతి పరీక్షలు రాయడానికి సెంటర్‌ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రుద్రవరం : రుద్రవరంలోని జెడ్పీఎస్‌ ఉన్నత పాఠశాల, మోడల్‌ పాఠశాలలో జరిగిన పది పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జడ్పీహెచ్‌ ఉన్నత పాఠశాలలో 153 మంది విద్యార్థులు, మోడల్‌ పాఠశాలలో 198 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.