
ప్రజాశక్తి-చీరాల
చీరాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని 70 అంశాలు ఆమోదం పొందాయి. మునిసిపల్ ఛైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ముందుగా కొత్తగా నియమితులైన టీపీఓ బాబూరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ కొండయ్యలను పరిచయం చేశారు. అనంతరం స్వల్పచర్చ మినహా సభ్యులు అన్ని అంశాలను ఆమోదించారు. స్థానిక గడియార స్తంభం వద్దనున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు పార్కింగ్ గురించి సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు. తోకల అనిల్ కుమార్ గతంలో నిర్ణయం తీసుకున్న పెయిడ్ పార్కింగ్ విషయం గుర్తు చేశారు. మించాల సాంబశివరావు మాట్లాడుతూ తనకు, అక్కడ ఉన్న వ్యాపార సంస్థకు ఎటువంటి సంబంధం లేదన్నారు. కారు పార్కింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. ఈ దశలో ఛైర్మన్ మాట్లాడుతూ అక్కడ సెల్లార్ లో ఉన్న ప్రదేశాన్ని మూడు విభాగాలుగా విభజించి పార్కింగ్‌కు ద్విచక్ర వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు, వాచ్ అండ్ వార్డ్ ఖర్చులు దుకాణదారులు భరించాలని తెలిపారు. ఇందుకు అసంతప్తి వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ తోకల అనిల్ కుమార్ సమావేశం నుంచి బయటకు వెళ్లారు. మొత్తానికి స్వల్ప చర్చ మినహా అన్ని అంశాలు ఆమోదం పొందిన ఈ సమావేశంలో కౌన్సిలర్లు, మునిసిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, డీఈ యేసయ్య, ఏఈలు కట్టా రవికుమార్, శైలజ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.