ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : జిల్లాలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, అందుకు సహకరించిన ప్రతి అధికారికీ, సిబ్బందికి జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాథన్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి ఆధ్వర్యాన ఎన్నికల విధులలో పాల్గొన్న రెవెన్యూ అధికారులు, సిబ్బందితో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమం, ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహణలో ప్రతి అధికారి, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేశారని తెలిపారు. మున్ముందు ఇదే స్పూర్తితో విధులు నిర్వర్తించి విశాఖ జిల్లా కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, శిక్షణ ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.










