Oct 15,2023 22:19

ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌
                రెండు రోజుల పాటు జరిగిన ఎస్‌ఐ అభ్యర్థుల రాత పరీక్షలు ప్రశాంతంగా సాగాయని ఏలూరు రేంజ్‌ డిఐజి అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఏలూరు రేంజ్‌ పరిధిలో ఉన్న ఎస్‌ఐ అభ్యర్థులకు ఏలూరు నగరంలోని ఐదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈనెల 14వ తేదీన ప్రారంభమైన పరీక్షలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ఏలూరు రేంజ్‌ పరిధిలో పరీక్షలకు మొత్తం 4162 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో మొదటి రోజు ఉదయం పరీక్షకు 52 మంది, మధ్యాహ్నం పరీక్షకు 53 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. రెండో రోజు 55 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల ప్రక్రియను అశోక్‌ కుమార్‌ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతంగా పరీక్షలు ముగిశాయని అభ్యర్థుల సౌకర్యార్థం ఏలూరు నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్‌ స్టేషన్లలో ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేశామన్నారు. బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా ఎస్‌పి మేరీ ప్రశాంతి, కృష్ణా జిల్లా ఎస్‌పి జాషువ, కోనసీమ జిల్లా ఎస్‌పి శ్రీధర్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి వారి బయోమెట్రిక్‌ ఆధారంగానే వారికి పరీక్ష హాల్లోకి అనుమతించామని తెలిపారు. జిల్లా అదనపు ఎస్‌పి ఎంజెవి.భాస్కరరావు, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్‌ ఎం.సుబ్బారావు, ఏలూరు డిఎస్‌పి శ్రీనివాసులు, డిటిసి డిఎస్‌పి కె.ప్రభాకర్‌రావు, డిఎస్‌పి గోగుల వెంకటేశ్వరరావు, ఏలూరు వన్‌ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజశేఖర్‌, టూ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, త్రీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ కోమాకుల శివాజీ, ఏలూరు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వరప్రసాద్‌, బి.ఆదిప్రసాద్‌ బందోబస్తు బందోబస్తు నిర్వహించారు.