Apr 03,2023 23:30

చిట్టివలస జెడ్పీ హైస్కూల్‌ వద్ద పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు

విశాఖ జిల్లాలో మొదటి రోజు పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభయ్యాయి. పరీక్షా కేంద్రాలను డిఇఒ, కలెక్టర్‌, అబ్జర్వర్‌, స్క్వాడ్‌ బృందాల సభ్యులు సందర్శించారు.
ప్రజాశక్తి -యంత్రాంగం

ఆరిలోవ : పదో తరగతి మొదటి రోజు తెలుగు పరీక్షకు విశాఖ జిల్లాలో 27,987 మంది హాజరు కావాల్సి ఉండగా 27,855 మంది హాజరయ్యారని, 132 మంది గైర్హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ తెలిపారు. జిల్లా అబ్జర్వర్‌ ఎం.జ్యోతికుమారి మూడు పరీక్షా కేంద్రాలను, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున రెండు కేంద్రాలను, స్క్వాడ్‌ బృందాలు 25 కేంద్రాలను, జిల్లా అధికారులు 6 కేంద్రాలను సందర్శించినట్టు పేర్కొన్నారు.
ఒపెన్‌ స్కూలు పరీక్షలో ఇద్దరు డిబార్‌
ఓపెన్‌ స్కూలు పది, ఇంటర్‌ పరీక్షలు కూడా సోమవారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ తెలిపారు. మొదటి రోజు పదో తరగతి పరీక్షకు 827 మంది విద్యార్థులకు గానూ 756 మంది, ఇంటర్మీడియట్‌ పరీక్షకు 782 మందికి 709 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ మూడు పరీక్షా కేంద్రాలను, స్క్వాడ్‌ బృందాలు నాలుగు కేంద్రాలను సందర్శించినట్లు తెలిపారు. పెందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థిని, మాధవధార జివియంసి ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థిని డిబార్‌ చేసినట్టు డిఇఒ తెలిపారు.
భీమునిపట్నం : జివిఎంసి భీమిలి మండల పరిధిలో ఏర్పాటు చేసిన 12 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు.
పదో తరగతి పరీక్షలకు మండలంలో 8 మంది గైర్హాజరైనట్లు ఎంఇఒ కెఎ.బాలామణి తెలిపారు. మొత్తంగా 12 పరీక్షా కేంద్రాల్లో 2216 మందికి 2208 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు వివరించారు.
పద్మనాభం : మండలంలోని మద్ది, పద్మనాభం, రెడ్డిపల్లి, రేవిడి జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో 8 ప్రభుత్వ పాఠశాలలు, కస్తూరిబా పాఠశాలలు, 7 ప్రయవేటు పాఠశాలలకు చెందిన 763 మంది విద్యార్థులకు 757 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్దా రేవిడి పిహెచ్‌సి ఆధ్వర్యాన వైద్యశిబిరం ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాలను ఎంఇం శివరాణి, తహశీల్దార్‌ తోట శ్రీవల్లి పర్యవేక్షించారు.
ఓపెన్‌ స్కూల్‌ పరీక్షకు 144 మంది హాజరు
పద్మనాభం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పరీక్ష జరిగింది. ఈ కేంద్రంలో 160 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 144 మంది హాజరైనట్లు ఎంఇఒ శివరాణి తెలిపారు.