Mar 15,2023 23:48

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల కేంద్రానికి పరీక్ష రాసేందుకు వచ్చిన ఇంటర్‌ విద్యార్థులు

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడినందుకు చింతపల్లిలో ఆరుగురు, సీలేరు ఒకరిని అధికారులు డిబార్‌ చేశారు.
ప్రజాశక్తి-పాడేరు టౌన్‌
అల్లూరి జిల్లా పాడేరు ఐటిడిఎ పరిధిలోని 11 మండలాల్లో బుధవారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమన్న నిబంధన కారణంగా విద్యార్థులు పరీక్షల కేంద్రాల వద్దకు ముందుగానే చేరుకున్నారు. పరీక్షలు మొదటి రోజు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలకు తరలి వచ్చారు. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
పాడేరు డివిజన్‌లో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. జిల్లా కేంద్రం పాడేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రం ఎలో ఒకేషనల్‌, జనరల్‌ మొత్తం 574 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 530 మంది పరీక్షకు హాజరయ్యారు. 44 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రం బిలో మొత్తం 212 మంది విద్యార్థులకు గాను 198 మంది విద్యార్థులు హాజరు కాగా, నలుగురు గైర్హాజరయ్యారు. జిటిడబ్ల్యూ గురుకుల జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రంలో 382 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 363 మంది హాజరయ్యారు. 19 మంది విద్యార్థులు పరీక్షకు రాలేదు. మూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 956 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వాల్సి ఉండగా, 893 మంది పరీక్షకు హాజరు కాగా 63 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.
హుకుంపేట: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. 346 మందికిగాను పరీక్షకు 37 మంది విద్యార్థులు హాజరు కాలేదని స్థానిక కళాశాల ప్రిన్సిపల్‌ కొట్టగుల్లి సింహాచలం నాయుడు తెలిపారు.పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కళాశాల ప్రిన్సిపల్‌ కొట్టగుల్లి సింహాచలం నాయుడు తెలిపారు.
విద్యార్థుల డిబార్‌
సీలేరు : జీకే వీధి మండలం సీలేరు ఇంటర్‌ పరీక్ష కేంద్రంలో బుధవారం ప్రథమ సంవత్సర పరీక్షలుత ప్రారంభమయ్యాయి. 49 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 48 మంది పరీక్షలు హాజరయ్యారు. ఒక విద్యార్థి గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభమైన గంట వ్యవధిలోని సిఇసి విద్యార్థి పెట్ల ప్రవీణ్‌ మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడగా, వెబ్‌ కెమెరా ద్వారా చీఫ్‌ సూపరింటెండెంట్‌ ఎ.సాయిరాం, డిపార్ట్‌మెంటల్‌ అధికారి కెవి రత్నం గుర్తించి, సదరు విద్యార్థిని డిబార్‌ చేశారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ విద్యార్థులు మాస్‌ కాపీయింగ్‌కి పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పరీక్ష కేంద్రంలో వెబ్‌ కెమెరాలు ఉన్నాయని, మాస్‌ కాపీయింగ్‌ ఎవరు పాల్పడినా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. వెబ్‌ కెమెరాలు ద్వారా ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ అధికారులు, ఐటీడీఏ పిఓ రోణంకి గోపాలకృష్ణ నిరంతరం పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. ఇది ఇలా ఉండగా చింతపల్లి పరీక్ష కేంద్రంలో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన ఆరుగురు విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు.
13 మంది గైర్హాజర్‌
రాజవొమ్మంగి : ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షకు 13 మంది విద్యార్థులు గైరాజరైనట్లు స్థానిక చీప్‌ ఎగ్జామినర్‌ విజయ రామ్మోహన్‌రావు తెలిపారు. 305 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 292 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. మండలంలోని జూనియర్‌ కళాశాల విద్యార్థులు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ ప్లస్‌ టు, ఏపీ గురుకుల కళాశాల విద్యార్థులు పరీక్షలు రాశారు. స్థానిక సీఐ బాజీలాల్‌ ఆధ్వర్యంలో రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్సైలు గోపి నరేంద్ర ప్రసాద్‌, షరీఫ్‌లు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటిరోజు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి.