Apr 06,2023 21:48

ప్రజాశక్తి - ఏలూరు స్పోర్ట్స్‌
        రెండో రోజు గురువారం పదో తరగతి హిందీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 22,796 మంది విద్యార్థులకు గాను 22,470 మంది హాజరయ్యారు. 326 మంది గైర్హాజరయ్యారు. 98.57 శాతం మంది హాజరయ్యారు. 120 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 51 కేంద్రాలను, కలెక్టర్‌ ఒక కేంద్రం, జెసి ఒక కేంద్రం, జిల్లాస్థాయి అబ్జర్వర్‌ ఐదు పరీక్షా కేంద్రాలు, జిల్లా విద్యాశాఖాధికారి ఐదు కేంద్రాలు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ రెండు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు.
ఏలూరు : పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్ద వేసవి దృష్ట్యా సురక్షిత తాగునీరును ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారును ఆదేశించారు. గురువారం స్థానిక కస్తూరిభా నగరపాలక బాలిక ఉన్నత పాఠశాలలో జరుతుగున్న పదోతరగతి పరీక్షల నిర్వహణను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సెంటర్లను పటిష్టమైన ఏర్పాట్లను సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలని ఆదేశించారు. కస్తూరిభా బాలికోన్నతపాఠశాలలో విద్యార్ధులు తాగడానికి ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి క్యానను కలెక్టర్‌ ఓపెన్‌ చేసి వాటర్‌ తాగి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా అన్ని పరీక్షా కేంద్రాల్లో సురక్షిత తాగునీటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఆదేశాలిచ్చారు. ఈ పర్యటనలో కలెక్టర్‌వెంట పాఠశాల చీఫ్‌ సూపరింటెండెంట్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.