98.46 శాతం ఓటింగ్ నమోదు
1,105 ఓట్లకుగాను పోలైనవి 1,088
ఓటు హక్కు వినియోగించుకున్న 15 మంది ఎంఎల్‌ఎలు
ఓటు వేయని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఓటర్ల తరలింపుపై అధికార పార్టీ ఎంఎల్‌ఎలు ప్రత్యేక శ్రద్ధ
భారీ బందోబస్తు నడుమ పోలింగ్ ప్రక్రియ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 98.46 శాతం ఓటింగ్ నమోదైంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 1,105 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉండగా 1,088 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 496 మంది ఉండగా 592 మంది మహిళలు ఉన్నారు. ఏలూరు ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 249 మంది ఓటర్లకుగాను 246 మంది (98.80 శాతం) తమ ఓటుహక్కు వినియోగించుకోగా వారిలో 108 మంది పురుషులు, 138 మంది మహిళలు ఉన్నారు. జంగారెడ్డిగూడెం ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 184 మంది ఓటర్లకుగాను 180 మంది (97.83 శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకోగా వారిలో 84 మంది పురుషులు, 96 మంది మహిళలు ఉన్నారు. కొవ్వూరు ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 242 మంది ఓటర్లకుగాను 240 మంది (99.17 శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకోగా వారిలో 107 మంది పురుషులు, 133 మంది మహిళలు ఉన్నారు. నర్సాపురం ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 229 మంది ఓటర్లకుగాను 227 మంది (99.13 శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకోగా వారిలో 103 మంది పురుషులు, 124 మంది మహిళలు ఉన్నారు. భీమవరం ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 201 మంది ఓటర్లకుగాను 195 మంది (97.01 శాతం) తమ ఓటుహక్కును వినియోగించుకోగా వారిలో 94 మంది పురుషులు, 101 మంది మహిళలు ఉన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు సాగింది. ఈ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ పి.అరుణ్‌బాబు పర్యవేక్షించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు ఆయన తెలిపారు. ఏలూరు జిల్లా పరిధిలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎస్‌పి రాహుల్‌దేవ్‌శర్మ, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ప్రశాంతి, ఎస్‌పి యు.రవిప్రకాష్ పరిశీలించారు.
బ్యాలెట్ బాక్సులు ఏలూరు ఎంపిడిఒ కార్యాలయానికి తరలింపు
జిల్లాలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను ఏలూరు ఎంపిడిఒ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు అధికారులు తరలించారు. ఈ నెల 16న కౌంటింగ్ జరగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.
మధ్యాహ్ననికి దాదాపు పోలింగ్ పూర్తి
ఉదయం ఎనిమిది గంటలకు ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్ ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగింది. మధ్యాహ్నం సమయానికే దాదాపు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. ఆ తర్వాత ఒకరిద్దరు ఓటర్లు మాత్రమే పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు అనుమతించలేదు. ఓటు హక్కు వినియోగించుకున్న వారికి సిరా మార్క్ వేయలేదు. స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో సిరా మార్క్ వేసే నిబంధన లేదని అధికారులు తెలిపారు.
ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చిన ఎంఎల్‌ఎలు
తమ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లను అధికార పార్టీ ఎంఎల్‌ఎలంతా దగ్గరుండి మరీ పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చారు. వారితోపాటు ఎంఎల్‌ఎలు ఓటేసి వెళ్లారు. ఏలూరు పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి, ఏలూరు ఎంఎల్‌ఎ అళ్ల నాని, ఎంఎల్‌ఎలు అబ్బాయిచౌదరి (దెందులూరు), పుప్పాల వాసుబాబు (ఉంగుటూరు), జంగారెడ్డిగూడెంలోని పోలింగ్ కేంద్రంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎంఎల్‌ఎలు తెల్లం బాలరాజు (పోలవరం), ఎలిజా (చింతలపూడి) ఓటు వేశారు. కొవ్వూరు పోలింగ్ కేంద్రంలో మంత్రి తానేటి వనిత, ఎంఎల్‌ఎలు శ్రీనివాసులు నాయుడు (నిడదవోలు), తలారి శ్రీను (గోపాలపురం) ఓటేయగా భీమవరంలో శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, డిప్యూటీ సిఎం కొట్టు సత్యనారాయణ, ఎంఎల్‌ఎలు గ్రంధి శ్రీనివాస్ (భీమవరం, మంతెన రామరాజు (ఉండి), నరసాపురంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, జెడ్‌పి ఛైర్మన్ కవురు శ్రీనివాస్, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్‌రాజు, ఎంఎల్‌ఎలు నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), చెరుకువాడ రంగనాథరాజు (ఆచంట), ఎంఎల్‌సి అంగర రామ్మోన్‌రావు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు, ఎంఎల్‌సి పాందువ్వ శ్రీను ఓటు వేయలేదు.
ఓట్ల చీలికపై తర్జనభర్జనలు
స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లో మొత్తం 1,105 ఓట్లుకుగాను 888 ఓట్లు వరకూ వైసిపికి ఉన్నాయి. 217 ఓటర్లు ప్రతిపక్షాలకు చెందినవారు ఉన్నారు. వైసిపికి రెండు ఎంఎల్‌సి స్థానాలు ఏకగ్రీవంగా కావాల్సి ఉండగా టిడిపి మద్దతుతో స్వతంత్ర అభ్యర్ధులు బరిలో నిలవడంతో ఎన్నిక అనివార్యమైంది. ఓట్లు చీలే అవకాశం ఉండటంతో అధికారపార్టీ తమ స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం ఓటుకు రూ.20 వేలు, కొవ్వూరు నియోజకవర్గంలో వెండి, సెల్‌ఫోన్లు వంటివిసైతం పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీల ఓటర్లను సైతం ప్రలోభపెట్టి ఓటు వేయించే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. ఇన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఓట్ల చీలికపై ఇంకా వైసిపిలో అనుమానాలు నెలకొన్నాయి. రెండో ప్రాధాన్యత ఓటు పక్కాగా వైసిపి అభ్యర్థులకు పడిందా లేక టిడిపి మద్దతుదారులకు వేశారా అనే చర్చ వైసిపిలో నడుస్తోంది.










