ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
ఓటు హక్కును వినియోగించుకున్న ప్రజాప్రతినిధులు
ప్రజాశక్తి - బనగానపల్లె
బనగానపల్లెలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి సోమవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మూడు పోలింగ్ కేంద్రాలలో, కస్బా ప్రాథమిక పాఠశాలలో ఒక పట్టభద్ర, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు జరిగాయి. కస్బా ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని కస్బా ప్రాథమిక పాఠశాలలో 350 పోలింగ్ బూత్‌లో 778 ఓట్ల గాను 614 ఓట్లు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 351 పోలింగ్ కేంద్రంలో 686 ఓట్లకు 550, 351-ఎలో 611 ఓట్లు, 352లో 738 ఓట్లకు 621 ఓట్లు పోల్ అయ్యాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ 443 ఓట్లకు 433 ఓట్లు పోలైనట్లు తహశీల్దారు శ్రీనివాసులు, ఎన్నికల డిప్యూటీ తాసిల్దార్ పుష్పకుమారి తెలిపారు. పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమణ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దిశ డిఎస్పి మురళి రావు, సిఐ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఎస్సై రామిరెడ్డి పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు నిర్వహించారు. మండలంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదయింది. నంద్యాల అర్బన్ : నంద్యాలలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కుటుంబ సభ్యులు తమ ఓటు హక్కును సోమవారం వినియోగించుకున్నారు. ఎమ్మెల్యే సోదరి శిల్పా, సతీమణి 36వ వార్డ్ కౌన్సిలర్ నాగిని రవిసింగారెడ్డి క్యూలైన్‌లో వెళ్లి ఓటు వేశారు. అలాగే ఆర్డిఓ కార్యాలయంలో ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా, జడ్పిటిసి, ఎంపిపి, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌లు, ఎంపిటిసిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. రుద్రవరం : మండల కేంద్రం రుద్రవరంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా సోమవారం జరిగాయి. స్థానిక కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ, పట్టభద్రుల, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రెండు బూతులు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఓటర్లు 39 ఉండగా 36 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రులు 789 ఓటర్లు ఉండగా 602 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆళ్లగడ్డ డిఎస్పి సుధాకర్ రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎస్సై నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా 144 సెక్షన్‌తోపాటు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్యాపిలి : ప్యాపిలి పట్టణంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో ప్రశాంతంగా జరిగాయి.ఉదయం ఎనిమిది గంటల నుండి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టభద్రులు, ఉపాధ్యాయులు బారులు తీరారు. సిఐ శ్రీరాములు, ఎస్‌ఐ సిఎం రాకేష్‌లు పోలింగ్ బూత్‌ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్యాపిలిలో తహశీల్దార్ చంద్రశేఖర్ వర్మ, డిటి మారుతి, జలదుర్గం పోలింగ్ బూత్‌లను పర్యవేక్షించారు. పోలింగ్ అనంతరం తహసిల్దార్ చంద్రశేఖర్ వర్మ మాట్లాడుతూ ప్యాపిలిలో 83.17 శాతం, జలదుర్గం 83.17 శాతం నమోదయిందని తెలిపారు. ఉపాధ్యాయులు 25కు 25 మంది ఓటు హక్కును వినియోగించు కున్నారని తెలిపారు. అవుకు : అవుకు మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పోలింగ్ అధికారులు పోలింగ్ కేంద్రం వద్ద అన్ని ఏర్పాట్లు చేయడంతో ప్రశాంతంగా ముగిసింది. మండలంలో 1097 పట్టభద్రులు ఉండగా 859 ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు.ఉపాధ్యాయులకు సంబంధించి 54 ఓట్లు ఉండగా 54 ఓట్లు పోలయ్యి 100 శాతం పూర్తయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎస్సై జగదీశ్వర్ రెడ్డి సిబ్బందితో పోలింగ్ కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజామల : సంజామల మండల కేంద్రంలో పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు తహశీల్దార్ మల్లికార్జున రావు తెలిపారు. పట్టభద్రులకు 1022 ఓట్లకు గాను 826 ఓటు పోలయ్యాయని, ఉపాధ్యాయులు 47 ఓట్లకు గాను 44 పోలైనట్లు చెప్పారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. మహానంది : మహానంది మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మండలంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం 82.03,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ శాతం 97 నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు నంద్యాల రూరల్ సీఐ రవీంద్ర, మహానంది ఎస్‌ఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మహానంది తహశీల్దార్ జనార్ధన్ శెట్టి మాట్లాడుతూ పట్టభద్రులు, ఉపాధ్యాయులు చాలా ఆసక్తిగా ఎన్నికల్లో పాల్గొన్నారని తెలిపారు. ఓటింగ్ జరుగుతున్న సమయంలో టిడిపి శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త బన్నూరు రామ లింగారెడ్డి, వైసిపి శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డిలు పరిశీలించారు. ఉయ్యాలవాడ : మండలంలోని స్థానిక ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని తహశీల్దార్ రవికుమార్ తెలిపారు. మండలంలో 690 మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా 524 మంది ఓటు హక్కును వినియోగించు కున్నారు. 21 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను 20 మంది ఓటు వేశారని తహశీల్దార్ తెలిపారు. ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శిరివెళ్ల : పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రం శిరివెళ్లలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన పోలింగ్‌ను డీఎస్పీ సుధాకర్ రెడ్డి, సీఐ చంద్ర బాబు నాయుడు, ఎస్సై శరత్ కుమార్ రెడ్డి, తహశీల్దార్ షేక్ మొహిద్దిన్, ఇతర అధికారులు పర్యవేక్షించారు. పట్టభద్రులు 1313 మందికి గాను 952 మంది, 69 మంది ఉపాధ్యాయులకు గాను 65 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డ మండలంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టబద్రులు మొత్తం 2692 ఓట్లుండగా 2073 పోలయ్యాయి. పోలింగ్ శాతం 76.83గా నమోదు అయింది. ఉపాధ్యాయ సంబంధించి 246 ఓట్లకు గాను 237 పోలయ్యాయి. పోలింగ్ శాతం 96.34గా నమోదయింది. 325 నెంబరు పోలింగ్ కేంద్రంలో ఏజెంట్ల వివరాల నమోదులో జాప్యం కారణంగా పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఎస్పీ రఘువీర్ రెడ్డితో వచ్చిన పోలీసు అధికారులు, సచివాలయ మహిళా పోలీసులు బూత్‌ల వద్ద బందోబస్తు నిర్వహిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేసి వారిని పంపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద చక్రాల కుర్చీలు లేకపోవడంతో వికలాంగులు ఇబ్బందులు పడ్డారు. అలాగే షామియానాలు కూడా లేకపోవడంతో ఓటర్లు ఎండలో ఇబ్బంది పడ్డారు. డిఎస్పి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐ జీవన్ గంగనాథ్ బాబు, ఎస్సైలు తిమ్మయ్య, వెంకటరెడ్డిలు తమ సిబ్బందితో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. దొర్నిపాడులో తహశీల్దార్ జయప్రసాద్ మాట్లాడుతూ 530 పట్టభద్రుల ఓట్లకు గాను 456 మంది, 18 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను 18 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గోస్పాడు : గోస్పాడు మండల కేంద్రంలో ఉపాధ్యాయులు 98 శాతం, పట్టభద్రులు 90 శాతం పోలింగ్ నమోదయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.










