ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ప్రజాశక్తి - ఆత్మకూర్
ఆత్మకూరు పట్టణంలో పట్టభద్రుల, టీచర్స్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికలు సోమవారం ప్రశాతంగా జరిగాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 2939 మంది ఉండగా ఇందులో 2253 పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు సంబంధించి 210 మంది ఓటర్లు ఉండగా ఇందులో 203 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు మొత్తం ఓటర్లు 165 మంది ఉండగా ఇందులో 164 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వెలుగోడు మండలం అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యురాలు కంచర్ల కనకమ్మ తన కాలు విరిగి నడవలేని స్థితిలో ఉండడంతో ప్రత్యేక వాహనంలో ఆర్డీవో కార్యాలయంలో ఉన్న ఎన్నికల పోలింగ్ కేంద్రానికి బంధువులు తీసుకొచ్చారు. సహాయకులతో ఆమెకు ఓటు హక్కు కల్పించాలని ఆమె బంధువులు కోరినప్పటికీ ఆర్డిఓ అందుకు సమర్థించలేదు. శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తన ఓటు హక్కును వినియోగిం చుకునేందుకు అక్కడికి వచ్చిన సందర్భంగా కనకమ్మ బంధువులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని వెళ్లారు. దీంతో అధికారులతో స్పందించి చర్చించి స్ట్రక్చర్ పైనే ఆమెను పోలింగ్ హాల్లోకి తీసుకొని వెళ్లి ఓటు వేసే విధంగా చర్య చేపట్టారు. అదే విధంగా ఎమ్మెల్యే వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ తను ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీశైలం నియోజవర్గ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి, ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్మన్ డాక్టర్ ఆసియాతోపాటు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టభద్రుల ఎన్నికల కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. అనంతరం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వెలుగోడులో తన ఓటు హక్కును వినియోగించు కున్నారు. మాజీ నాయ శాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా స్థానిక డిఎస్పి శృతి, రామాంజనేయులు నాయక్ ఆధ్వర్వంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.










