
పుట్టపర్తి అర్బన్ : ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. విజయ దశమి పర్వదినం పురస్కరించుకుని సాయి కుల్వంత్ సభా మండపాన్ని రకరకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. దేశ విదేశీ భక్తులతో ప్రశాంత నిలయం కిటకిటలాడింది. దసరా పండుగ పురస్కరించుకొని విశ్వశాంతిని కాంక్షిస్తూ ఏటా నిర్వహించే వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏడు రోజుల పాటు కొనసాగి మంగళవారం పూర్ణాహుతితో ఘనంగా ముగిసింది. యజ్ఞం అనంతరం నదీ పుణ్య జలాలను రుత్వికులు భక్తులపై సంప్రోక్షించారు. సాయంత్రం సాయి కుల్వంత్ సభా మండపంలో భగవాన్ సత్యసాయి బాబా పూర్వపు ఉపన్యాసాన్ని తెరలపై ప్రదర్శించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు, మహేష్ రాఘవన్ బృందం సంగీత గాన కచేరి భక్తులను ఆకట్టుకున్నాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. సిఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె రత్నాకర్, సత్యసాయి యూనివర్సిటీ ఛాన్సలర్ చక్రవర్తి, నాగానంద్, జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ మాధవరెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మొబైల్ హాస్పిటల్ వ్యాన్ ప్రారంభించిన రత్నాకర్
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే మొబైల్ హాస్పిటల్ వాహనాన్ని సత్యసాయి సెంట్రల్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జె రత్నాకర్ ప్రారంభించారు. గతంలో ఉన్న మొబైల్ ఆసుపత్రి వాహనానికి ఇది అదనంగా సమకూర్చారు. ఇందులో అధునాతన స్కానింగ్, ఎక్సరే, ఇతర పరికరాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రజలు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే అత్యవసర రోగులకు పరీక్షలు నిర్వహించే విధంగా తీర్చిదిద్దారు.