ప్రజాశక్తి-చీరాల: ఎన్నికలను ప్రశాంతంగా జరగాలంటే ఎన్నికల విధులలో ఉన్న పోలీస్ సిబ్బంది ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశించారు. జిల్లాలో జరగనున్న పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఆదివారం చీరాల ఎన్‌ఆర్‌పిఎం హైస్కూల్‌లో చీరాల, పర్చూరు నియోజక వర్గాలలో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ప్రత్యక్షంగానూ, అద్దంకి నియోజక వర్గంలో విధులు నిర్వహించే అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన బ్రీఫింగ్ నిర్వహించి ఎన్నికలకు సంబంధించిన విధివిధానాలపై మాట్లాడారు. 13న ఉదయం8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని 13 మండలాల్లో జరుగుతాయన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి తగినంత మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి స్ట్రైకింగ్ ఫోర్స్‌కు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒను అధికారిగా నియమించామన్నారు. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారుల సారథ్యంలో క్యూఆర్‌టి టీమ్‌లు పనిచేస్తుంటాయన్నారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌కు అడిషనల్ ఎస్పీ, డిఎస్‌పి స్థాయి అధికారుల సారథ్యంలో పనిచేస్తూ ఉంటాయన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది సంబంధిత రూట్ ఆఫీసర్, క్విక్ రియాక్షన్ టీమ్, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారుల ఫోన్ నెంబర్లు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో సున్నంతో గీతాలు వేయించాలని, ఎవరైతే ఓట్లు వేయడానికి వస్తారో వారు ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత అక్కడ ఉండకుండా చూడాలన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగే ప్రాంతాలలో 144 సిఆర్‌పిసి సెక్షన్ అమలులో ఉన్నందున ఎవరూ గుంపులు గుంపులుగా చేరనీయకూడదన్నారు. సామగ్రికి ఎస్కార్ట్‌గా వెళ్లి ఈరోజు నుంచి రేపు పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌కు చేరేంతవరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. లాడ్జిలను, హౌటళ్లను తనిఖీ చెయ్యాలన్నారు. చెక్ పోస్ట్‌లలో ప్రతి ఒక్క వాహనాన్ని తరువుగా తనిఖీ చేసి క్యాష్, లిక్కర్ మరియు ప్రజలను ప్రలోభాలకు గురిచేసే ఇతర వస్తువులను నియంత్రించా లన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పి మహేష్, బాపట్ల డిఎస్‌పి ఏ శ్రీనివాసరావు, చీరాల డిఎస్‌పి పి శ్రీకాంత్, రేపల్లె డిఎస్‌పి టి మురళీకృష్ణ, డిఎస్‌బి ఇన్‌స్పెక్టర్ ఏ శ్రీనివాస్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రత్యేక బందోబస్తు చర్యలు
జిల్లాలోని 13 మండలాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పటిష్ట పోలీస్ భద్రత ఏర్పాటు చేశామని ఎస్‌పి తెలిపారు. ఒక అడిషినల్ ఎస్పీ, ఇద్దరు డిఎస్పీలు, 8 మంది ఇన్‌స్పెక్టర్‌లు, 40 మంది ఎస్‌ఐ లు, 20 మంది ఏఎస్‌ఐలు, 95 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 367 మంది కానిస్టేబుళ్లు, 68 మంది హౌమ్ గార్డులు, 98 మంది ఆర్మ్‌డ్ ఫోర్స్ మొత్తం 697 మంది పోలీస్ సిబ్బంది మరియు అధికారులతో పాటు 3 సెక్షన్ల ఏపీఎస్‌పీ బలగాలను వినియోగిస్తున్నామన్నారు. ప్రతి మండలంలో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లను నియమించామన్నారు. 13 స్ట్రైకింగ్ ఫోర్స్‌లను, 7 క్విక్ రియాక్షన్ టీమ్‌లను, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా, ఏదైనా అవాంఛనీయ ఘటన చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్నదన్న సమాచారం తెలిసిన వెంటనే స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీములు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు ఆ ప్రదేశానికి చేరుకుని సమస్యను పరిష్కరించి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.










