May 22,2023 22:17

ప్రజాశక్తి - ఏలూరు
           తెలంగాణ విప్లవ పోరాటయోధుడు, సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీఎంఎల్‌ఎ పర్స సత్యనారాయణ జీవితం నేటి కమ్యూనిస్టు నాయకులకు, కార్యకర్తలకు ఆదర్శమని సిసిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి కొనియాడారు. పర్స సత్యనారాయణ ఎనిమిదో వర్థంతిని సోమవారం స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ 'సభ్యులు పి.కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సత్యనారాయణ చిత్రపటానికి రవి, కార్యకర్తలు, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ సత్యనారాయణ వీర తెలంగాణ విప్లవ పోరాటయోధునిగా, సింగరేణి కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించి అక్కడే సంఘాన్ని ఏర్పాటు చేసి సిఐటియు రాష్ట్ర అధ్యక్షునిగా, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా పని చేశారని తెలిపారు. ఆయన తుది శ్వాస విడిచే వరకూ ప్రజల గురించి, వారి సమస్యల గురించి ఆలోచిస్తూ, ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు నడిపారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.రామకృష్ణ, కట్టా సత్యనారాయణ, లెనిన్‌, త్రినాధ్‌, ఎం.సత్యం, సింహాచలం పాల్గొన్నారు.
సిఐటియు కార్యాలయంలో..
సిఐటియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు పర్స సత్యనారాయణ వర్థంతిని సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. సత్యనారాయణ చిత్రపటానికి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సోమయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.లింగరాజు ప్రధాన కార్యదర్శి డిఎన్‌విడి.ప్రసాద్‌ మాట్లాడుతూ సత్యనారాయణ తన జీవితాన్ని కార్మిక లోకానికి అంకితం చేశారన్నారు. సుమారు 50 ఏళ్లకుపైగా రాష్ట్రంలో కార్మిక సమస్యలపై ఎనలేని పోరాటాలు చేశారని తెలిపారు. కార్మికులు సాధించుకున్న అనేక చట్టాల వెనక పర్స సత్యనారాయణ వంటి కార్మిక నాయకులు కృషి దాగి ఉందన్నారు. ఆనాడు పోరాడిసాధించుకున్న చట్టాలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎల్‌ఎగా కూడా పనిచేసిన పర్స సత్యనారాయణ కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో అలుపెరగని కృషి చేశారన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సాధన కోసం ఎంఎల్‌ఎ పదవికి తృణప్రాయంగా రాజీనామా చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.విజయలక్ష్మి, సిహెచ్‌.సుందరయ్య, వివిఎన్‌.ప్రసాద్‌, వి.సాయిబాబు, జె.గోపి, మహేశ్వరి జయసుధ పాల్గొన్నారు.