May 23,2021 07:14

   జి-7 విదేశాంగ మంత్రులు విడుదల చేసిన ప్రకటన జూన్‌ సమావేశానికి ఎజెండాను నిర్దేశిస్తున్నది. చైనా, రష్యాలను ఒంటరిపాటు చేయడం, అమెరికాతో యూరోపియన్‌ యూనియన్‌ మరింత సన్నిహితంగా ఉంటూ, మిగతా ప్రపంచంపై పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ఎదురులేకుండా చూడాలన్నది బైడెన్‌ ఎజెండా. అమెరికా అధ్యక్షునిగా బైడెన్‌ పగ్గాలు చేపట్టిన వెంటనే అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా తిరిగి జోక్యం చేసుకుంటుందని, అన్ని వ్యవహారాలను తానే శాసిస్తుందని అన్నారు.
   జి-7 విదేశాంగ మంత్రులు ఈ నెల మొదటి వారంలో లండన్‌లో సమావేశమై ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అందులో రష్యాను హానికరమైన దేశంగాను, చైనాను రౌడీ రాజ్యంగాను చిత్రించారు. చైనా వ్యతిరేక, రష్యా వ్యతిరేక అంశాలు-ఉయిగర్స్‌, తైవాన్‌, హాంకాంగ్‌, క్రిమియా, ఉక్రెయిన్‌ మున్నగువాటిని- ఆ ప్రకటనలో దట్టించారు. ఆ విధంగా వారు తమ మితవాద ఎజెండాను నగంగా బయటపెట్టుకున్నారు. విదేశాంగ మంత్రుల ప్రకటనలో పస ఏమీ లేదు. ఆ ప్రకటన ముగింపులో 'నియమబద్ధ అంతర్జాతీయ క్రమానికి' తామే అధినాయకులమన్నట్లుగా పేర్కొనడం జి-7 దేశాల అహంకార పూరిత ధోరణిని తెలియజేస్తోంది. అది చెప్పే నియమబద్ధ అంతర్జాతీయ క్రమం ఐక్యరాజ్యసమితి, దాని భద్రతా మండలితో కూడిన నిజమైన చట్ట బద్ధ ప్రపంచ క్రమానికి విరుద్ధమైనట్టిది. అలాంటి జి-7 దేశాలకు తోకలా వ్యవహరించేందుకు భారత్‌ ఎందుకంత ఆసక్తి చూపిస్తున్నట్లు? జి-7 దేశాల సదస్సుకు ఆహ్వానితురాలిగా రమ్మంటే తగుదు నమ్మా అంటూ భారత్‌ పరుగులు తీయాల్సిన అవసరమేమిటిి? ఇది మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం కాదా ?
   జి-7 సదస్సుకు భారత్‌ హాజరు కావడమంటే ఆ కూటమి చేసే నిర్ణయాలకు ఒక రకంగా చట్టబద్ధత కల్పించేందుకు తోడ్పడడమే. మాజీ వలసవాదులు, వలస లను స్థిరపరచుకున్న శక్తుల ప్రాపంచిక దృక్పథం మనకు కానీ, ఇతర ప్రపంచానికి కానీ ఏం అవసరం? బ్రిటన్‌కు మానవ హక్కుల గురించి మాట్లాడే హక్కును మనమెందుకు గుర్తించాలి? దాని చరిత్రంతా మానవ హక్కుల ఉల్లంఘనలు ఎవరికి తెలియవు ?
   భారత్‌కు ఇబ్బందికరంగా పరిణమించిన అంశమేమిటంటే జి-7 విదేశాంగ మంత్రుల సమావేశానికి వెళ్లిన భారత ప్రతినిధి బృందంలో ఇద్దరికి పాజిటివ్‌ వస్తే విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సహా యావత్‌ ప్రతినిధి బృందాన్ని స్వీయ ఐసొలేషన్‌లో ఉంచారు. దీంతో వారు సమావేశానికి దూరమయ్యారు. జి-7కూటమిలో ఉండేదెవరు? వివిధ అంశాలపై మాట్లాడే అధికారం వారికెవరిచ్చారు? జి-7 అనేది అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, జపాన్‌ , ఇటలీ, కెనడా వంటి పశ్చిమ దేశాలతో ఏర్పడిన కూటమి. ఈ భూమండలంపై నాగరికులం తామేనని, ప్రపంచం ఎలా నడవాలో శాసించే అధికారం తమకే ఉందనేది వీరి భావన. యూరోపియన్‌ యూనియన్‌ తరపున ఇయు కమిషన్‌ అధ్యక్షుడు జి-7కి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇయు మండలి చైర్మన్‌ శాశ్విత అతిథిగా వుంటారు. అలాగే నాటో లోని అన్ని సభ్య దేశాలకు జి-7 ప్రాతినిధ్యం వహిస్తుంది. జి-7 అనేది నాటోకు రాజకీయ ముఖం లాంటిది. ఇంకా సూటిగా చెప్పాలంటే 2019లో ఒక పరిశీ లకుడు వ్యాఖ్యానించినట్లు పైకి అది ఎన్ని ముఖోటాలు ధరించినప్పటికీ దాని అసలు స్వరూపం దాచేస్తే దాగేది కాదు. శ్వేత జాతి ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు అది విశ్వ ప్రయత్నం చేస్తోంది.
   జూన్‌లో కార్న్‌వాల్‌ (బ్రిటన్‌) లో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు సన్నాహకంగా జరిగిందే ఈ విదేశాంగ మంత్రుల సమావేశం. జి-7 విదేశాంగ మంత్రులు విడుదల చేసిన ప్రకటన జూన్‌ సమావేశానికి ఎజెండాను నిర్దేశిస్తున్నది. చైనా, రష్యాలను ఒంటరిపాటు చేయడం, అమెరికాతో యూరోపియన్‌ యూనియన్‌ మరింత సన్నిహితంగా ఉంటూ, మిగతా ప్రపంచంపై పశ్చిమ దేశాల ఆధిపత్యానికి ఎదురులేకుండా చూడాలన్నది బైడెన్‌ ఎజెండా. అమెరికా అధ్యక్షునిగా బైడెన్‌ పగ్గాలు చేపట్టిన వెంటనే అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా తిరిగి జోక్యం చేసుకుంటుందని, అన్ని వ్యవహారాలను తానే శాసిస్తుందని అన్నారు. ట్రంప్‌ 'అమెరికా ఫస్ట్‌' విధానం, అలాగే యూరప్‌, జపాన్‌, దక్షిణ కొరియాల్లో నాటో బలగాలకు అయ్యే లక్షలాది డాలర్ల ఖర్చులో తమ వంతు వాటా చెల్లించాలంటూ వదిలేసిన పాత్రను తాను తిరిగి చేపడతానని అన్నారు. ప్రచ్ఛన్న యుద్ధంలో ఓడిపోయిన దేశానికి ఎంత ప్రతిపత్తి ఉంటుందో అంతే ప్రతిపత్తి రష్యాకు ఉంటుంది. అంతకు మించి ఎలాంటి పాత్ర దానికి ఉండదని అమెరికా, నాటో దేశాలు పుతిన్‌ కు స్పష్టం చేశాయి. అంటే దాని పాత్ర జూనియర్‌ భాగస్వామికే పరిమిత మని, రష్యా దీనిని అంగీకరించక తప్పదని అన్నాయి. ఎల్సిన్‌ హయాంలో మాదిరే పశ్చిమ దేశాల పెట్టుబడుల ప్రవేశానికి రష్యా ఆర్థిక వ్యవస్థ తలుపులు బార్లా తెరవాలని, ఆ దేశంలోని వనరులను కొల్లగొట్టుకు పోయేందుకు వీలు కల్పించా లని జి-7 దేశాల కూటమి ఒత్తిడి తెస్తున్నది. అలా కాకుండా యూరప్‌లో తనకంటూ ఒక స్థానాన్ని కలిగి ఉండడం కోసం పుతిన్‌ యత్నిస్తు న్నారు. అయినా ఆయత్నాలు ఫలించడం లేదు. సోవియట్‌ యూనియన్‌కు ఇచ్చిన హామీకి భిన్నంగా నాటో ఇప్పు డు తూర్పు దేశాలకు విస్తరించాలని చూస్తోంది. జర్మనీ దాటి నాటో విస్తరించ బోదని గతంలో సోవియట్‌ యూనియన్‌కు అది హామీ ఇచ్చింది. ఆ హామీని అది ఎన్నడూ గౌరవించిన పాపాన పోలేదు. బాల్టిక్‌ దేశాలలోను, పోలండ్‌ లోను నాటో తన క్షిపణి బ్యాటరీలను నెలకొల్పింది. రష్యా సరిహద్దు సమీపంలో ని బాల్టిక్‌ దేశాలతో గల సరిహద్దు వద్ద తరచూ సైనిక విన్యాసాలు నిర్వహి స్తున్నది. దీనికి భిన్నంగా రష్యా తన సరిహద్దుకు లోపల సైనిక విన్యాసాలు జరుపుకుంటే రుమేనియా, పోలండ్‌ నానా యాగీ చేస్తాయి.
   యూరప్‌, మధ్య ఆసియా, పశ్చిమాసియా ప్రాంతాల్లో రష్యా ఒక బలమైన సైనిక శక్తిగా తిరిగి అవతరిస్తూ నాటోకి గట్టి సవాల్‌ విసురుతున్నది. రష్యా మిలిటరీ బలగాలు, దాని అణ్వాయుధ సంపత్తి తమకు వ్యూహాత్మక ముప్పుగా పరిణమిస్తుందని పశ్చిమ దేశాలు ప్రచారం చేస్తున్నాయి. రష్యా గ్యాస్‌, చమురు యూరప్‌ దేశాలకు అవసరం. హైడ్రో కార్బన్‌ వనరులు యూరప్‌కు దగ్గరగా అందుబాటులో ఉండేవి రష్యా నుంచే. రష్యాను ఆర్థికంగా బహిష్కరించాలని అమెరికా యూరోపియన్‌ యూనియన్‌పై ఒత్తిడి పెంచుతున్నది. ఈ విషయమై తన మిత్ర పక్షం జర్మనీని బెదిరించేందుకు సైతం వెనుకాడ లేదు. సముద్రం గుండా వేసిన నార్డ్‌ స్ట్రీమ్‌ పైపు లైన్‌పై ఆంక్షలు విధిస్తామని అమెరికా బెదిరిస్తున్నది. రష్యాతో కయ్యంలో ఇయు దేశాలను రంగంలోకి దింపేందుకు జి-7ని అమెరికా ఒక పావుగా ఉపయోగించుకుంటున్నది. అబద్ధాల కోరు ఎల్సిన్‌ హయాంలో లాగే రష్యా రోజురోజుకీ కుంగిపోతుందని అమెరికా తలచింది. కానీ, రష్యా అటు ఆర్థికంగాను, ఇటు మిలిటరీ పరంగాను తనను తాను పటిష్టపరచుకునేందుకు యత్నిస్తోంది. సిరియాలో తన సత్తాను చాటుకుంది.
   నాటో కూటమి తన రెండో దాడిని చైనాపైకి ఎక్కుపెట్టింది.ఆసియాలో ముఖ్యంగా ఆగేయాసియా, తూర్పు ఆసియాపై యుద్ధానికి కాలు దువ్వుతోంది. చైనాను కట్టడి చేసేందుకు సముద్రాలపై తన అజమాయిషీని ఉపయోగించుకోవాలని అమెరికా చూస్తున్నది. చైనా కట్టడికి ఒబామా 'పైవోట్‌ ఆసియా' పేరుతో వ్యూహం పన్నాడు. దానిని ఇప్పుడు ఇండో-పసిఫిక్‌ వ్యూహం అని పిలుస్తున్నారు. పేరులో మార్పు తప్ప దాని సారంలో ఎలాంటి మార్పు లేదు. 2028 నాటికి చైనా అమెరికాను దాటి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. కాబట్టి చైనాను దెబ్బ తీయడానికి ఈ ఇండో- పసిఫిక్‌ వ్యూహాన్ని అమెరికా ముందుకు తెచ్చింది. చైనాకు చెందిన పలు హైటెక్‌ కంపెనీలపై అమెరికా పలు ఆంక్షలు విధించింది. దీనిద్వారా చైనా అభివృద్ధిని అడ్డుకోవచ్చని అది భావించింది. స్వేచ్ఛా నావికాయానం పేరుతో దక్షిణ చైనా సముద్రంలో తన నావికా శక్తిని ప్రదర్శిస్తున్నది. అటువంటి పనే ఇటీవల లక్షద్వీప్‌ లోని ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోని భారత సముద్ర జలాల్లో అమెరికా యుద్ధ నౌక అక్రమంగా ప్రవేశించింది.
   లండన్‌లో జరిగిన జి-7 విదేశాంగ మంత్రుల సమావేశం వచ్చే నెలలో జరిగే దాని ప్రభుత్వాధినేతల సమావేశం ఎజెండా ఒక్కటే. రష్యా, చైనాలకు వ్యతిరేకంగా అక్ష రాజ్యాల కూటమిని పటిష్టపరచుకోవడం. రష్యాపై ఆర్థిక ఆంక్షలు, చైనాపై టెక్నాలజీ పరమైన ఆంక్షలు విధించడం, గ్లోబల్‌ ఆర్థిక వ్యవస్థపై ఉన్న తన పట్టును ఉపయోగించుకుని రష్యా, చైనాలను ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి వేరు చేయాలని చూస్తున్నది. ఆ విధంగా చైనాను ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగనీయకుండా దాని అభివృద్ధిని కుంటుపడేలా చేయొచ్చని అమెరికా భావిస్తున్నది.
   దీనికి రెట్టింపు స్థాయిలో రష్యా, చైనా స్పందన ఉన్నది. ఈ రెండు దేశాలు ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటూ మరింత దగ్గర కావాలని నిర్ణయించుకున్నాయి. రష్యా ఇప్పటికీ ఒక ప్రధాన సైనిక శక్తిగా ఉన్నది. అమెరికా బెదిరింపులకు అది తలొగ్గే ప్రశ్నే లేదు. మరో వైపు చైనా ప్రపంచ మ్యానుఫ్యాక్టరీగా ఇప్పటికే అవతరించింది. తన పారిశ్రామిక, సాంకేతిక పునాదిని బాగా పటిష్టపరచుకున్నది. దానికి ఉన్న ఏకైక బలహీనత చిప్‌ తయారీ రంగంలో వెనుకబాటు. అయితే 5జి, అరుదైన ఎర్త్‌ ప్రొడక్షన్‌ బ్యాటరీలు వంటి పలు రంగాల్లో అమెరికా కన్నా చైనా చాలా ముందున్నది.
   వ్యూహాత్మక పోటీలో అమెరికా బలహీనత స్పష్టమే. అమెరికా నావికా శక్తిగా ఉండగా, రష్యా, చైనాలు పదాతి దళాల్లో బలీయమైన శక్తిగా ఉన్నాయి. దీనికి తోడు చైనా వాణిజ్యరంగంలో చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బిఆర్‌ఐ) మధ్య ఆసియా, తూర్పు యూరోపియన్‌ దేశాల అభివృద్ధికి చోదక శక్తిగా ఉన్నది. జర్మనీ, ఇతర పశ్చిమ దేశాలకు విస్తరించడం ద్వారా యురేసియా ప్రాంత ప్రజలకు ప్రత్యామ్నాయ అవకాశాలను చైనా చూపుతున్నది. బ్రిటన్‌ పూర్తిగా అమెరికన్‌ ఇండో-పసిఫిక్‌ విజన్‌తో షరీకైంది. జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు యురేసియన్‌ మార్కెట్‌లో ప్రధాన శక్తిగా ఇప్పటికే ఉన్నాయి. ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఇయు నిర్వహించిన పాత్రను పరిశీలించినా ఇది అర్థమవుతుంది. అలాంటప్పుడు భారత్‌ ఎందుకు అమెరికా, బ్రిటన్ల వెంట పరుగులు తీయాలి, అవి ముందుకు తీసుకొచ్చిన ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో ఎందుకు భాగస్వామిగా చేరాలి? దక్షిణ చైనా సముద్రంలో అమెరికా స్వేచ్ఛా నావికా యానాన్ని, దక్షిణ చైనా సముద్రం ప్రపంచానికంతటికీ కామన్‌గా చెందుతుందనే దాని వాదనను భారత్‌ సమర్థిస్తుందా?
ఉత్తర సరిహద్దుల్లో చైనాతో విభేదాలున్నంత మాత్రాన భారత్‌ తన వ్యూహాత్మక స్వతంత్రతను, సార్వభౌమత్వ స్థాయిని పణంగా పెట్టి అమెరికాను గుడ్డిగా అనుసరించడం తగునా? ఒకప్పుడు ఈ సంపన్న దేశాల విధానాలకు వ్యతిరేకంగా అలీనోద్యమ నాయకురాలి హోదాలో ముందు పీఠిన నిలిచిన భారత్‌, ఇప్పుడు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికాతో కలసి జి-7కి ఉపాంగంగా మారడానికి ఎందుకంతగా తహతహ లాడుతున్నట్టు? స్వతంత్ర విదేశాంగ విధానానికి సంబంధించి మోడీ ప్రభుత్వానికి ఎలాంటి వ్యూహాత్మక వైఖరి ఉన్నట్టు కనిపించడం లేదు. అమెరికా ప్రాపకం కోసం పాకులాడుతూ అది విధించే వ్యూహాత్మక చట్రంలో భారత్‌ను బందీగావించేందుకు మోడీ ప్రభుత్వం ఎక్కడలేని ఆతృత కనబరుస్తున్నది. అమెరికాకు బంటుగా ఉంటే ఉన్నత చర్చల బల్ల దగ్గర నేడు కాకుంటే రేపైనా సీటు ఇవ్వకపోతుందా అని మోడీ ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా ఉంది. ఈ విధమైన వైఖరి దేశానికి ఎంతమాత్రమూ మేలుకూర్చదు.
 

ప్రబీర్‌ పుర్కాయస్థ

ప్రబీర్‌ పుర్కాయస్థ