ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ విద్యార్థులు భవిష్యత్‌లో ప్రపంచ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధపడాలని జిల్లా విద్యాశాఖ అధికారి వి.నాగరాజు పిలుపునిచ్చారు. జెవివి నాయకులు గాంగేనాయక్ అధ్యక్షతన శుక్రవారం జన విజ్ఞాన వేదిక నగర కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీ సినర్జి పాఠశాలలో చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. ముందుగా చెకుముకి సంబరాలు-2023 ప్రశ్నపత్రాలను డిఇఓతోపాటు జెవివి రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా చెకుముకి సంబరాల కార్యక్రమాన్ని జెవివి చాలా విజయ వంతంగా నిర్వహిస్తోందన్నారు. ఈ సంవత్సరం ప్రశ్నపత్రాన్ని తన చేత ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి పోటీ పరీక్షలు రాయడం వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం, వాటి పట్ల అవగాహన పెరుగుతుందన్నారు. భాష వేరు కావచ్చు కానీ సిలబస్ అంతా ఒక్కటే కాబట్టి విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని అది హైస్కూల్ స్థాయి నుంచే మొదలవ్వాలని సూచించారు. జెవివి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ ప్రపంచ సైన్స్ దినోత్సవం రోజున ప్రపంచ వ్యాప్తంగా సైన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పటి ప్రాచీన మానవుడు ప్రకృతిని చూసి బయపడే వాడని ప్రస్తుతం సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత అందులోని రహస్యాలను చేదించాడానికి సైన్స్ ప్రాధాన్యత పెరిగిందన్నారు. సైన్స్, శాస్త్రీయ పద్ధతి అంటే సరిగా ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, ఆములు చేయడమేనని వివరించారు. ఈ కార్యక్రమంలో జెవివి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ పి.ప్రసూన, సీనియర్ నాయకులు డాక్టర్ వీరభద్రయ్య, స్కూల్ కరస్పాండెంట్ మధు, జెవివి నాయకులు రామిరెడ్డి, వీరరాజు, లక్ష్మీనారాయణ, రామకృష్ణ, నూర్, ప్రసాద్, ప్రసాద్‌రెడ్డి, నవీన్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.