ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున యూనవర్సిటీలో 8 మంది ప్రొఫెసర్లను తొలగిస్తూ బుధవారం జరిగిన పాలకమండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. గతంలో వేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన అధ్యాపకులు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగాలు పొందారని కొందరు కోర్టును ఆశ్రయించగా కోర్టు గత నోటిఫికేషన్ కొట్టివేసింది. దీంతో వారిని ఉద్యోగాల నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాలు పొందిన వారిలో ఒకరు బయట కళాశాల నుండి వర్సిటీ వచ్చినవారు కాగా మిగతా ఏడుగురు వర్సిటీలో ఉద్యోగాలు చేస్తూ తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్‌లో ప్రొఫెసర్లుగా పోస్టింగులు పొందిన వారే. గత ఉద్యోగాలపై ప్రభుత్వ నిర్ణయం తీసుకొని ఆ మేరకు ఆలోచించాలని పాలకమండలి నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే వారు పాత ఉద్యోగాలలో కొనసాగే అవకాశం ఉంది. గతంలో క్యాష్ ప్రమోషన్లు పొందని వారిలో ఎవరైనా అర్హులుంటే వారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. నూతన నియామకాల్లో పాటించాల్సిన విధి విధానాలపైన సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.










