వైసిపి, టిడిపి వర్గీయుల బాహాబాహీ
పరస్పరం వాగ్వాదం, తోపులాట
టిడిపి ఫ్లోర్‌లీడర్, మహిళా కార్పొరేటర్‌పై దాడి
ప్రజాశక్తి- సీతమ్మధార: 26వ వార్డులో గురువారం అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా ప్రోటోకాల్ వివాదం చెలరేగి, వైసిపి, టిడిపి వర్గీయులు బాహాబాహీకి దిగడంతో తోపులాట, వాగ్వాదం, దాడులతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా జివిఎంసిలో టిడిపి ఫ్లోర్‌లీడర్ శ్రీనివాసరావు, స్థానిక టిడిపి కార్పొరేటర్‌కు గాయాలయ్యాయి.
26వ వార్డులో రూ.1.53కోట్లతో అభివృద్ధి పనులకు నగర మేయర్ హరివెంకటకుమారి, ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, డిప్యూటీ మేయర్లు, స్థానిక వార్డు టిడిపి కార్పొరేటర్ ముక్క శ్రావణి పాల్గొని శంకుస్థాపన చేస్తుండగా, ప్రోటోకాల్ విషయమై వివాదం రేగడంతో పరస్పరం వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి కట్టడిచేసే ప్రయత్నం చేసినప్పటికీ, దాదాపు గంటసేపు పోటాపోటీ నినాదాలు, దాడులతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వార్డు టిడిపి కార్పొరేటర్ ముక్క శ్రావణికి శరీరంపై గాయాలయ్యాయి. టిడిపి ఫ్లోర్‌లీడర్ పీలా శ్రీనివాసరావుపై వైసిపి వర్గీయులు దాడి చేయడంతో ఆయన కిందపడిపోవడంతో నాలుగు లక్షల విలువైన వాచ్ బద్దలైంది.
ఈ సందర్భంగా టిడిపి కార్పొరేటర్ శ్రావణి మాట్లాడుతూ, మహిళా కార్పొరేటర్‌నని కూడా చూడకుండా వైసిపి నేతలు దౌర్జన్యంగా ప్రవర్తించారని, దీంతో తనకు ఒంటిపై గాయాలయ్యాయని వాపోయారు. ఏడాదిన్నరగా తన వార్డు పరిధిలో ప్రోటోకాల వివాదం సృష్టిస్తున్నారని, దీనిపై మేయర్ దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి మార్పురాలేదన్నారు. వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త కెకె.రాజు మాట్లాడుతూ, వార్డులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే టిడిపి నేతలు గొడవలు సృష్టిస్తున్నారన్నారు. టిడిపి ఫ్లోర్‌లీడర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రోటోకాల్ విషయమై ప్రశ్నిస్తే, వైసిపి నేతలు గూండా రాజకీయాలు చేస్తున్నారని, వివాదంలో తాను కిందపడిపోతే, నాలుగు లక్షల విలువైన వాచీ పాడైపోయిందన్నారు. వైసిపి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. జివిఎంసి ఇన్‌ఛార్జి డిఇఇని వివరణ కోరగా ప్రోటోకాల్ ప్రకారమే ముందస్తు సమాచారమిచ్చామని అంటున్నారు.










