ప్రోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తాం : జనసేన
పజాశక్తి - తిరుపతి (మంగళం)
పోలీసులు సెక్షన్ 307ను అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జనసేన, టిడిపి, సిపిఐ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా పథకం ప్రకారం హత్య చేయాలని ప్రయత్నిస్తే పెట్టాల్సిన సెక్షన్ 307 కేసును ప్రెస్ మీట్ పెట్టిన మహిళలపై పెట్టడం సిగ్గుచేటన్నారు. ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతుండగానే పోలీసులు లోపలికి ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకుంటే పోలీసులపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ కేసు పెట్టడం దారుణమన్నారు. గతంలో విశాఖ పట్నంలోనూ వాటర్ బాటిళ్లు విసిరారని 92 మంది జనసైనికులపై హత్యాయత్నం కేసులు నమోదు చేస్తే... న్యాయమూర్తి 9 మందికి మాత్రమే రిమాండ్ విధించారన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపికి చెందిన వెయ్యి మందిపై కేసులు పెడితే అందులో సింహభాగం హత్యాయత్నం కేసులేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వేపనపల్లిలో ఫీజు రీఎంబర్స్ మెంట్ అడిగినందుకు కొంత మందిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారన్నారు. జిల్లాలో సెక్షన్ 307ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీని కాకుండా ఐపీసీని ఫాలో అవ్వాలని కోరారు. అధికార పార్టీ నాయకులు తల పగలకొడితే హత్యాయత్నం కేసులు నమోదు చేయని పోలీసులు... తమ నాయకులు, కార్యకర్తలపై మాత్రం ఎలాంటి ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేస్తున్నారన్నారు. చివరకు దిష్టిబొమ్మలు దగ్దం చేసినా 307 కేసులు పెట్టడం దారుణమన్నారు. రాష్ట్రంలో హత్యాయత్నం కేసులను దుర్వినియోగం చేస్తున్న పోలీసులపై ప్రవేటు కేసులు వేస్తామన్నారు. అలాగే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హౌంమంత్రితో పాటు సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు లేఖలు రాస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టిడిపి మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.మురళి పాల్గొన్నారు. టిడిపి నేత గాలి భానుప్రకాష్‌పై దాడిని ఖండించారు
మీడియాతో మాట్లాడుతున్న జనసేన, టిడిపి, సిపిఐ నాయకులు .










