Mar 06,2023 23:53

మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి

ప్రజాశక్తి-అనకాపల్లి
ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలను ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 111 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని, రెగ్యులర్‌ విద్యార్థులు 22,232 మంది, 1681 మంది ప్రైవేటు అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మాస్‌ కాపీయింగ్‌ లేకుండా చూడాలన్నారు. అని కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు స్పాట్‌ వ్యాల్యూషన్‌ అయ్యేవరకు స్థానిక భీముని గుమ్మం జీవీఎంసీ ఉన్నత పాఠశాల స్ట్రాంగ్‌ రూములో పటిష్ట పోలీసు బందోబస్తుతో భద్రపరచడం జరుగుతుందని తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ దాత్రి రెడ్డి, డీఈవో వెంకట లక్ష్మమ్మ, అడిషనల్‌ ఎస్పీ విజయభాస్కర్‌, డిఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ హేమంత్‌, ఏపీఈపీడీసీఎల్‌ డిఇ రమణమూర్తి, డిఎస్‌పి మల్ల మహేశ్వరరావు, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ పాల్గొన్నారు.