ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్ : తెలుగురాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన రచయిత్రి చక్కిలం విజయలక్ష్మి సోమవారం సాయంత్రం కర్నూలు జిల్లా కేంద్రం వెంకటకరమణ కాలనీలో తుదిశ్వాస విడిచారు. మంగళవారం కర్నూలులో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. కర్నూలు నగరంలో రుక్మిణమ్మ, కఅష్ణమూర్తి దంపతులకు 1948లో జన్మించారు. స్థానిక బాలికోన్నత పాఠశాలలోనే సెవెన్త్ ఫారం ఆంటే ఇప్పటి ఇంటర్మీడియేట్ వరకు కెవిఆర్ మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. పారిశ్రామికవేత్త శ్రీనివాసరావును పెళ్ళాడారు. ఆ దంపతులకు ఇద్దరబ్బాయిలు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. చదువుకునే రోజుల్లోనే తెలుగు భాషా సాహిత్యాలను అమితంగా ప్రేమించారు. చిన్నప్పటినుంచే రచనలు చేయడం ఆరంభించారు. 1973లోనే ఆమె కథ పూలవనం ప్రచురితం అయ్యింది. 1975లో మరుభూమిలో మల్లెతీగలు నవల రాశారు. కథలు, నవలలు విరివిగా రాయడం ఆరంభించారు. 1973 నుండి 1983 వరకు ఉజ్వల వారపత్రికలో సహసంపాదకులుగా పని చేశారు. ఆమె సాహిత్యాభిలాషను గమనించిన సంపాదకులు మనోహరరావు ఆమెతో సంపుటి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 1977లో ఆంధ్రప్రభ వారపత్రికలో తండ్రులూ తీర్పుమీదే! నవల సీరియల్‌గా ప్రచురితమైంది. శాంతితీరం నవలకూడా దారవాహికంగా ప్రచురితమైంది. దేశం నలుమూలలా ఈమె నవలలకు పాఠకులు వేలమంది అభిమానులు తయారయ్యారు. 1979లో బిందు అనే నవల వనితాజ్యోతిలో ప్రచురితమైంది. ఇదేమి న్యాయం మహిళ మాసపత్రికలో సీరియల్‌గా వచ్చింది.1980లో కాగితపు పడవలోజీవితపు పయనం అనే నవలను కర్నూలు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం వారు ప్రచురించారు. దీన్ని సంఘం ప్రథమ మహాసభల సందర్భంగా ఆవిష్కరించారు. భాషా సాహిత్యాలపై పట్టు సాధించడానికి కారణం చిన్నప్పటినుంచి ప్రతి విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మంతో పరిశీలించి అవగాహన చేసుకోవడమే అంటారు. ః బాగా చదవడం చిన్నప్పటినుంచి అలవాటుగా మారింది. పాలు అనే కథలో పిల్లల్ని అద్దెకు తెచ్చుకుని ఇళ్ళన్నీ తిరిగి అడుక్కుని బతుకీడ్చేవారి గూర్చి రాస్తే దానికి బహుమతి లభించింది.1983లో ఆంధ్రభూమి వారపత్రికలో తెరతీయగ రాదా నవల సీరియల్‌గా వచ్చింది. ఈ రాగానికి అదే తాళం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. 1985లో ఆంధ్రభూమిలో సెంటర్ సీరియల్‌గా చిన్నారి చెల్లి తెలుగుపాఠకులను విశేషంగా అకట్టుకుంది. అన్వేషి అనే నవల భాషావైవిధ్యాన్ని, శిల్ప సౌందర్యాన్ని కలిగి వుంటుంది. 10 కవితలు ప్రచురితమయ్యాయి. అనేక రేడియో నాటికలు రాశారు. చక్కిలం రాసిన నవలను తెలియకుండా, హక్కులుపొందకుండా సినిమా కూడాతీశారు. చక్కిలం ఇప్పటివరకు రాసిన 60కు పైగా కథలన్నీ ప్రచురితమయ్యాయి. నీ గుండె కార్చిన కన్నీరు, పడవప్రయాణం, కాకిగూడు, ప్రేమంటే తెలుసా నీకు, పాలు, అంత్యక్రియలు, శాంతికి శిలువ, జ్ఞాన నేత్రం, గంగాజలం అనే కథలు తెలుగు కథా సాహిత్యంలో సంచలనాలు. గుండెకార్చిన కన్నీళ్ళు, జ్యేష్టభాగం,చంద్రమతి రచనలకు ఎన్నో బహుమతులచ్చాయి. శరత్, త్రిపురనేని గోపిచంద్, రా.వి.శాస్త్రి అమితంగా చదివే ఈ రచయిత్రి సమాజాన్ని ప్రతిబింబించే రచనలకే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటివరకు 14 నవలలు రాసి తెలుగు నవలాసాహిత్యంలో నవలారాణి అనిపించుకున్నారు. కర్నూలు జిల్లా చరిత్రను రాస్తే దాన్ని ఆంధ్రభూమి దినపత్రికలో దారావాహికంగా ప్రచురించారు. ఈనాడు దినపత్రికలో అంతర్యామి అనే ఆధ్యాత్మిక శీర్షికను నిర్వహించారు. ఈనాడు సాహిత్య మాసపత్రిక తెలుగు వెలుగులో ప్రేమలేఖలపోటీలో బహుమతి వచ్చింది. ఫెమినిస్టు ధఅక్ఫథం కలిగినప్పటికీ మానవసంబంధాలను ప్రేమించే రచయిత్రిగా ఆమె రచనల్లో కనిపిస్తారు. విస్మరించిన ఆత్మశక్తి వ్యాసంలో '' ఈనాడు స్త్రీజాతి గతాన్ని ఓ పీడకలగా ఓ కొత్త ఉషోదయాన్ని చూస్తోంది, అందామె.
పలువురు సంతాపం
సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ , జిల్లా గౌరవాధ్యక్షులు ఎంపి బసవరాజు ,కోశాధికారి అయ్యన్నలు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి మరణానికి సంతాపం ప్రకటించారు. నవ్యాంధ్రరచయిత్రుల సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు కావెం సుబ్బలక్ష్మమ్మ, ఉపన్యాసకులు దండెబోయిన పార్వతీదేవి, రచయిత గౌరెడ్డి హరిచంద్రారెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.











