ప్రజాశక్తి-గుంటూరు : ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల ప్రమోషన్లు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించాలని, బదిలీలు, ప్రమోషన్లు విడివిడిగా నిర్వహించాలని ఫ్యాప్టో చైర్మన్ ఎం.కళాధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బదిలీలలోని అసంబద్ధతను సవరించాలని ఫ్యాప్టో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఆదివారం డిఇఒ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం డిఇఒ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.నిర్మలకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కళాధర్ మాట్లాడుతూ ప్రమోషన్ల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ధిష్ట విధానం పాటించకుండా గందరగోళం సృష్టించటం, ప్రమోషన్లు ఖాళీలు చూపకుండానే అంగీకారం కోరటం వల్ల ఉపాధ్యాయులు ఎక్కువ మంది ప్రమోషన్లను తిరస్కరిస్తున్నారన్నారు. ఫ్యాప్టో కో-చైర్మన్ జి.మోహనరావు మాట్లాడుతూ బదిలీల విషయంలో సంఘాలతో జరిపిన చర్చల్లో అంగీకరించిన విషయాలు ఉత్తర్వులలో లేవని, ఉత్తర్వులలో ఉన్న విషయాలు ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్‌లో లేవని అన్నారు. కావున బదిలీల జిఒలోని అసంబద్దాలను సరిచేయాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో నాయకులు బసవలింగారావు మాట్లాడుతూ ప్రమోషన్లు సీనియారిటీ లిస్టులు, ఖాళీలు ముందుగా చూపి, మాన్యువల్‌గా కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఏ సమస్యా లేకుండా ప్రమోషన్లు విజయవంతం అవుతాయన్నారు. బదిలీ ప్రభావం ఉపాధ్యాయులపై 8 ఏళ్లు ఉంటుందని, బదిలీ సక్రమంగా జరగని పక్షంలో ఉపాధ్యాయుడు 8 ఏళ్లు నష్టపోయే అవకాశం ఉందని, కావున బదిలీల జిఒలోని అసంబద్ధాలను తొలగించాలని ఖాళీలు అన్నీ బదిలీలకు చూపాలని, బ్లాకింగ్ విధానం మానుకోవాలని అన్నారు. పల్నాడు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ సంపత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆందోళనను పట్టించుకోకుండా ముందుకు పోవటం వల్ల పోరాటం ఉధృతం అవుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు బి.ఆదిలక్ష్మి, నరసింహారావు, ఖలీద్, సిహెచ్.నరసింహారావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










