Jul 25,2023 23:38

యూనియన్‌ పెదనందిపాడు మండలం నూతన కమిటీ

ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్‌ : అంగన్వాడీ హెల్పర్ల ప్రమోషన్‌లలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, హెల్పర్లకు వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రమా సుష్మ డిమాండ్‌ చేశారు. మండల కేంద్రమైన పెదనందిపాడులోని కొత్తపాలెం స్కూల్లో యూనియన్‌ మండల సదస్సు మంగళవారం నిర్వహించారు. సదస్సుకు శ్రీదేవి అధ్యక్షత వహించగా రమా సుష్మా మాట్లాడుతూ జిల్లాలో అనేక చోట్ల ప్రజాప్రతినిధుల జోక్యం వల్ల హెల్పర్ల నుండి టీచర్లకు ప్రమోట్‌ చేసే జీవోని నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. హెల్పర్ల ప్రమోషన్లు పోరాడి సాధించుకున్న చట్టబద్ధమైన హక్కు అని చెప్పారు. యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజీ మాట్లాడుతూ అర్హుల ప్రమోషన్‌కు రాజకీయ జోక్యంతో అడ్డుపడితే యూనియన్‌ చూస్తూ ఉరుకోదని హెచ్చరించారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఆ తర్వాతే వర్కర్ల విధులు గురించి మాట్లాడాలని హితవు పలికారు. ప్రాజెక్టు అధ్యక్షులు ప్రేమలీల, కార్యదర్శి పద్మ మాట్లాడుతూ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయాలని, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. ప్రీ స్కూల్‌ పిల్లలకు అమ్మ ఒడి, యూనిఫామ్‌ ఇవ్వాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలని, సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో వారికి ఉద్యోగం ఇవ్వాలని, బీమా అమలు చేయాలని, 2017 నుండి పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సిఐటియు నాయకులు కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు, చిన్న పిల్లలకు అనేక సేవలంది స్తున్న అంగన్వాడీలకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించకపోవడం దారుణమన్నారు. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శివపార్వతి, కార్యదర్శిగా యు.శ్రీదేవి, కోశాధికారిగా సైదాని, ఉపాధ్యక్షులుగా కాకుమాను ధనలక్ష్మి, సునంద, సహాయ కార్యదర్శులుగా వెంకటలక్ష్మి, రమాదేవి, మరో ఐదుగురు సభ్యులు ఎన్నికయ్యారు.