Jun 15,2023 23:56

నరసరావుపేటలో ధర్నా చేస్తున్న కార్మికులు

ప్రజాశక్తి - నరసరావుపేట : మున్సిపల్‌ పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ఎదుట గురువారం నిరసన చేపట్టారు. శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శిలు సిలార్‌ మసూద్‌, ఈవూరి మస్తాన్‌రెడ్డి మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలు, హెల్త్‌ అలవెన్సులు జీతంతో కలిపి ఇవ్వాలని కోరారు. నరసరావుపేట మున్సిపల్‌ పరిధిలో పనిచేస్తున్న కార్మికులందర్నీ ఆప్కాస్‌లో చేర్చి రెగ్యులర్‌ కార్మికులతో పాటు రూ.21 వేలు వేతనం ఇవ్వాలన్నారు. కొబ్బరి నూనె, చెప్పులు, సబ్బులు ఇవ్వాలని, ఇఎస్‌ఐ కార్డులు మంజూరుతోపాటు వేతనంతో కూడిన వారాంతపు సెలవులు, పండుగ సెలవులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు టి.మల్లయ్య, డి.యోహాను, కె.కమల కుమారి, సాల్మన్‌, పి.ఏసు, రమణ, సురేష్‌, ఐజాక్‌బాబు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పారిశుధ్య పనుల్లో కీలకమైన తమను పర్మినెంట్‌ చేయాలని కోరుతూ పారిశుధ్య కార్మికులు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం శానిట ఇన్‌స్పెక్టర్‌ రమాదేవి వినతిపత్రం ఇచ్చారు. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పని చేసిన కార్మికులను కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. తాను అధికారంలోకి వస్తే కాంటాక్ట్‌ కార్మికులందరిని పర్మినెంట్‌ చేస్తానని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడేందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంటాక్ట్‌, ఎన్‌ఎంఆర్‌, ఇంజినీరింగ్‌ విభాగ కార్మికులను వెంటనే పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న పీఎఫ్‌ స్లిప్పులు, సబ్బులు, నూనెలు, యూనిఫామ్‌ చెప్పులు వెంటనే ఇవ్వాలన్నారు. కరోనా సమయంలో తడి చెత్త, పొడి చెత్త క్రింద తీసుకున్న కొత్త కార్మికులను వెంటనే కాంటాక్ట్‌ కార్మికుల్లో కలపాలని, ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఎంఎంఆర్‌లను పర్మినెంట్‌ చేయాలని కోరారు. ధర్నాలో ఎం.ప్రతాపం, కె.సీతారామయ్య, బి.రామారావు, డి.లక్ష్మి, అనంతరాములు, గంగమ్మ, పార్వతి, సుజాత, ఇంజినీరింగ్‌ విభాగ కార్మికులు రాజు, షేక్‌ సుబానీ, కె.శ్రీను, వెంకయ్య, రమేష్‌ పాల్గొన్నారు.
ప్రజాశక్తి - మాచర్ల : మాచర్ల పురపాలక సంఘంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులందర్నీ పర్మినెంట్‌ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్‌ మేనేజర్‌కు వినతి పత్రం ఇచ్చారు. కార్మికుల సమస్యలను సిఐటియు నాయకులు మహేష్‌ వివరించారు. రమణ, శోభన్‌ కుమార్‌, వి.వెంకట్రావు పాల్గొన్నారు.