Jul 27,2023 22:51

ప్రజాశక్తి-కాకినాడ మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లా యీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో గురువారం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు, మున్సిపల్‌ వర్కర్స్‌ గౌరవాధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయడం చాలా అభినందనీ యమన్నారు. ఏళ్ల తరబడి ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులను, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను కూడా పర్మినెంట్‌ చేసి ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకోవాలని కోరారు. ఈ లోపు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. పర్మినెంట్‌ కార్మికులకు సిపిఎస్‌ రద్దు చేయాలని, బకాయి ఉన్న సరెండర్‌ లీవులు, డిఎలు చెల్లించాలన్నారు. క్లాప్‌ డ్రైవర్‌లకు జిఒ నెంబర్‌ 7 ప్రకారం రూ.18,500 జీతం చెల్లించాలని, వారాంతపు సెలవులు క్యాజువల్‌ లీవులు అమలు చేయాలన్నారు. శానిటేషన్‌ వాహనాలు నడుపుతున్న ఆప్కోస్‌ డ్రైవర్లకు హెల్త్‌ అలవెన్సు ఇప్పించాలన్నారు. జీతంతో పాటే హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించాలన్నారు. స్పెషల్‌ శానిటేషన్‌ వర్కర్స్‌ను ఆప్కోస్‌లో చేర్చాలన్నారు. వాటర్‌ వర్క్స్‌, పార్కులు, స్కూల్స్‌, సులభ్‌ కాంప్లెక్స్‌లలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ప్రభుత్వ జిఒ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని, వారాంతపు సెలవులు, క్యాజువల్‌ లీవులు ఇప్పించాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా యూనిఫాం, సబ్బులు, చెప్పులు, టవల్స్‌, నూనె తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ, జిల్లా కౌన్సిల్‌ మెంబర్‌ మేడిశెట్టి వెంకట రమణ మాట్లాడారు. అనంతరం నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌ నాగనరసింహారావుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్‌ నాయకులు బంగారు సత్తిబాబు, జలగడుగుల శ్రీనివాస్‌, మందపల్లి సూర్య ప్రకాష్‌, యరంశెట్టి నాగబాబు, వర్రే రమణ, సత్యనారాయణ, సింహాచలం, సత్యేంద్ర, చిరంజీవి, రాజు, శ్రీను, లక్ష్మి, నాగమణి, శ్యామల, దుర్గ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సఫాయి కర్మచారీ నాయకులు బండి లక్ష్మీనారాయణ సంఘీభావం తెలిపారు.