'ఇన్‌కోయిస్' అధ్యయనంలో వెల్లడి
జిల్లాలోనూ అత్యధికంగా సముద్రతీరం కోతకు గురికానున్నట్లు నిర్థారణ
10 శాతం బహుళ ప్రమాదాలు కలిగిన జోన్‌గా గుర్తింపు
ఆందోళనలో తీర ప్రాంత గ్రామాల ప్రజలు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
జిల్లాలోని సముద్ర తీర ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉందని, తీర ప్రాంతంలో నివశిస్తున్న ప్రజానీకం ముంపు సమస్యను ఎదుర్కోనున్నట్లు నేషనల్ ఇంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఇన్‌కోయిస్) అధ్యయనంలో వెల్లడైంది. ఇన్‌కోయిస్ డైరెక్టర్ టి.శ్రీనివాస్‌కుమార్ నేతృత్వంలోని సీనియర్ శాస్త్రవేత్తలు టిఎం.బాలకృష్ణన్‌నాయర్, సుధీర్‌జోసెఫ్, పిఎ.ఫ్రాన్సిస్, పిసి మొహంతి, ఆర్‌ఎస్ మహేంద్ర ఈ అధ్యయనం నిర్వహించారు. శాస్త్రవేత్తల అధ్యయనంలో అనేక దిగ్భ్రాంతి గొలిపే విషయాలు వెల్లడయ్యాయి. సముద్ర తీరం పెద్దఎత్తున కోతకు గురికానున్న ప్రాంతాల్లో జిల్లాలోని తీర ప్రాంతం సైతం ఉంది. జిల్లాలోని తీర ప్రాంతం పది శాతం బహుళ ప్రమాదాలు కలిగిన తీర ప్రాంతజోన్ (సిఎంజెడ్)గా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ముంపునకు గురయ్యే తీర ప్రాంతం జిల్లాలోనూ అత్యధికంగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలో 706 గ్రామాలు, ఎనిమిది పట్టణాల్లో దాదాపు 90 శాతం ప్రాంతం బహుళ ప్రమాదకర జోన్ పరిధిలోకి వస్తాయని వెల్లడించిన అధ్యయనంలో పశ్చిమగోదావరి జిల్లాలోని తీర ప్రాంతం గురించి శాస్త్రవేత్తలు స్పష్టంగా పేర్కొన్నారు. విభజిత పశ్చిమగోదావరి జిల్లాలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం విస్తరించి ఉంది. మొగల్తూరు, నరసాపురం మండలాల్లోని పేరుపాలెం సౌత్, కెపిపాలెం సౌత్, తూర్పుతాళ్లు, పెదమైనివాని లంక, చినమైనివాని లంక, బియ్యపుతిప్ప గ్రామాలు తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్నాయి. దాదాపు 20 వేల మంది జనాభా వరకూ తీరప్రాంత పరిధిలో నివశిస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీరిలో పది వేల మందికిపైగా మత్స్యకారులు ఉన్నారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం నాలుగువేల మందికి పైగా సముద్రంలో చేపల వేటతో ఉపాధి పొందుతున్నారు. గతంకంటే తీరప్రాంతంలో కోత పెరుగుతున్న పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. పలు గ్రామాల్లో తీరం పెద్దఎత్తున కోతకు గురవడంతో కొబ్బరిచెట్లు సైతం నేలకొరిగిన పరిస్థితి ఉంది.
నదులపై అధిక రిజర్వాయర్ల నిర్మాణంతోనే తీరం కోత
డాక్టర్ పి.ఎ.రామకృష్ణంరాజు, ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫెసర్, పర్యావరణ వేత్త
కృష్ణ, కావేరితోపాటు పలు నదులపై పెద్దసంఖ్యలో రిజర్వాయర్లు నిర్మించేశారు. నదుల్లో నీరు సముద్రంలోకి రావడం లేదు. నదుల్లో నీరు సముద్రంలోకి ప్రవేశించినప్పుడు పెద్దఎత్తున మట్టి చేరుకుంటుంది. దీంతో సముద్రం తీరంలో మట్టి చేరి లోపలికి పూడుకుంటుంది. పదివేల ఏళ్ల క్రితం నుంచి కొట్టుకొచ్చిన మట్టి వల్లే ఇప్పుడున్న తీరం ఉంది. సముద్రంలోకి నదుల నీరు రాకపోవడంతో మట్టిరావడం తగ్గిపోయింది. దీంతో సముద్రపు తీరం కోతకు గురికావడం పెరిగిపోతుంది. కొల్లేరు పూడుకుపోవడం కారణంగా ఉప్పుటేరు కోతకు గురవుతోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో భవిష్యత్తులో ప్రమాదంగా మారనుంది.
ఆందోళనలో తీర ప్రాంత ప్రజలు
తీర ప్రాంతంలో ముంపు ముప్పుపై వెల్లడవుతున్న అధ్యయనాలతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే తుపాన్లు సంభవించినప్పుడు తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలల ఉధృతి భయాందోళనలు కల్గిస్తున్నాయి. తీరంలో అలలు ముందుకొస్తుండటంతో కోత పెరుగుతోంది. దీంతో తుపాన్ల సమయంలో స్థానిక ప్రజానీకాన్ని పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఉంది. 50 ఏళ్ల ముందు కంటే తీర ప్రాంతం కోతకు గురై బాగా ముందుకు చొచ్చుకొచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. తీరం కోత పెరిగే కొద్ది స్థానిక ప్రజానీకానికి సంబంధించిన భూములు, ఇళ్లు సైతం ప్రమాదంలో పడే పరిస్థితి రానుంది. అదే జరిగితే తీర ప్రాంత ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడనుంది. పంట భూములను కోల్పోనున్నారు. గత శతాబ్ధకాలంలో అలల తాకిడి స్థాయిలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత అధ్యయనం జరిగింది. దీనిప్రకారం తీరం ప్రమాదంలో ఉందని స్పష్టమవుతోంది.










