Sep 17,2023 21:21

ఎస్‌కోట: నిరసన తెలుపుతున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి- శృంగవరపుకోట
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. చంద్రబాబు నాయడు అక్రమ అరెస్ట్‌, పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసుల దాడులు, అక్రమ అరెస్టులకు నిరసనగా ఆదివారం 5వ రోజు ఆకుల డిపో వద్ద టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ రమాదేవి దంపతులు, పట్టణంలోని ధార గంగమ్మ ఫంక్షన్‌ హాలు వద్ద నియోజకవర్గ ఇంఛార్జి కోళ్ల లలిత కుమారి రాంప్రసాద్‌ దంపతులు నియోజకవర్గ టిడిపి నాయకులతో వేరువేరుగా రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లిమర్ల: నియోజక వర్గం కేంద్రంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు ఆదివారం కొనసాగాయి. ఈ దీక్షల్లో నియోజక వర్గం ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు, సీనియర్‌ నాయకులు కంది చంద్ర శేఖర్‌రావు, సువ్వాడ రవి శేఖర్‌, మహిళా పార్ల మెంట్‌ అధ్యక్షులు సువ్వాడ వనజాక్షి, నెల్లిమర్ల, భోగాపురం మండల పార్టీ అధ్యక్షులు కడగల ఆనంద్‌ కుమార్‌, కర్రోతు సత్య నారాయణ, జిల్లా అధికార ప్రతినిధి గేదెల రాజారావు, రాజప్పన్న, పాల్గొన్నారు.
బొండపల్లి: చంద్రబాబుకు తోడుగా మేము సైతంలో భాగంగా గజపతినగరం నుండి విజయనగరంలో గల పైడితల్లమ్మ దేవాలయం వరకు రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణ ఆదివారం తలపెట్టిన పాదయాత్ర కార్యక్రమాన్ని పోలీసులు భగం చేశారు. శివరామకృష్ణను అరెస్ట్‌ చేసి ఆండ్ర పొలీసు స్టేషన్‌కు తరలించారు. ఈయనతో పాటు టిడిపి నాయకులు బోని గోవింద, కరుమజ్జి కృష్ణ, మజ్జి గోవింద్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.విజయనగరంకోట.. నగరంలోని అశోక్‌ బంగ్లా వద్ద టిడిపి చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా టిడిపి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిమిడి నాగార్జున మాట్లాడారు.

బొబ్బిలి నుంచి సింహాచలం పాదయాత్ర
బొబ్బిలి: చంద్రబాబుకు బెయిల్‌ రావాలని, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుతూ బొబ్బిలి నుంచి సింహా చలం వరకూ పాదయాత్ర చేయనున్నట్లు టిడిపి నియోజకవర్గ ఇంచార్జి బేబినాయన చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బొబ్బిలిలో ఐదో రోజు ఆదివారం సామూహిక నిరాహారదీక్షలు కొన సాగాయి. ఈనెల 22న ఉదయం బొబ్బిలి శ్రీవేణుగోపాల స్వామి ఆలయం వద్ద పాదయాత్ర ప్రారంభిస్తామని చెప్పారు. పాద యాత్రగా సింహాచలం చేరుకుని సింహాద్రి అప్పన్నకు పూజలు చేస్తామన్నారు. పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి సీనియర్‌ నాయకులు రౌతు రామమూర్తి, పట్టణ అద్యక్షులు రాంబార్కి శరత్‌, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గెంబలి శ్రీనివాసరావు, నాయ కులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.