ప్రజాశక్తి-గుంటూరు లీగల్ : బెజవాడ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులకు విజయవాడ సిఐడి పోలీసులు నోటీసులు ఇవ్వటాన్ని గుంటూరు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. నోటీసులను వ్యతిరేకిస్తూ సోమవారం మధ్యాహ్నం జిల్లా కోర్టు ప్రధాన ద్వారం ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించిన న్యాయవాదులు సిఐడి తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయ వ్యవస్థను కాపాడాలనుకునే న్యాయవాదుల ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడతాయని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కెవికె సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దాసరి ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, షేక్ నైనా, జి.విజయరాజకుమార్, పర్చూరి నంద, జి.శ్రీలక్ష్మి, టిడిపి లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు సిహెచ్.రమేష్, న్యాయవాదులు కట్టా కాళిదాసు, షేక్ సుభాని, అశ్విన్ గురజాల అనురాధ, పి.రాజేశ్ పాల్గొన్నారు.










