Feb 24,2021 06:35

భారత దేశంలో ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజానికి పేరెన్నికగన్న 'కారవాన్‌' పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ వినోద్‌ కె జోస్‌ ఫిబ్రవరి నెల ప్రారంభం రోజున ట్విట్టర్‌ తెరిచి చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ట్విట్టర్‌లో 'కారవాన్‌' పత్రిక అకౌంట్‌ ఆపేశారు. ఆరా తీస్తే... ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమాన్ని కింది స్థాయి కథనాలతో విస్తృతంగా కవర్‌ చేయడమే పత్రిక అకౌంట్‌ మూసేయడానికి కారణమని తేలింది. ''భాతర దేశ ప్రభుత్వం జారీ చేసిన న్యాయపరమైన విజ్ఞప్తి మేరకు'' ఈ చర్య తీసుకున్నట్లు ట్విట్టర్‌ తెలిపింది. రైతుల పాలిటి ఉరి తాళ్లయిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన, ఆ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతిచ్చిన అనేక అకౌంట్లను ట్విట్టర్‌ ఇటీవలి కాలంలో మూసేసింది.


నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల వార్తలను ఇప్పటికే కార్పొరేట్‌ మీడియా బ్లాక్‌ చేసింది. భారత దేశ చరిత్రలోనే అపూర్వమైన పోరాటం ఇది. లక్షల మంది రైతులు ఆరుబయట చలిలో, వర్షంలో ఇన్ని రోజులు సత్యాగ్రహ దీక్ష చేయడం బహుశా ప్రపంచ చరిత్రలో కూడా అపూర్వమైన సంఘటన. కానీ ఈ పోరాటానికి కార్పొరేట్‌ మీడియాలో వస్తున్న కవరేజీ చూస్తే అదృశ్య హస్తమేదో మీడియాకూ, పోరాటానికీ మధ్య అడ్డుగోడలా నిలబడినట్టుంది.


ఈ అడ్డుగోడలు ఛేదించుకుని రిపోర్టు చేస్తున్న పత్రికలు, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియా మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. 'కారవాన్‌' పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ మీద, దాని యాజమాన్యం మీద, ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు మన్‌దీప్‌ పునియా మీద ఇప్పటికే బిజెపి ప్రభుత్వం 'దేశ ద్రోహం' కేసు నమోదు చేసింది. ఎందుకు?... రైతుల ఉద్యమ వార్తలను ప్రచారం చేయడం ద్వారా వారు దేశ ద్రోహానికి పాల్పడుతున్నందుకని ప్రభుత్వం చెబుతోంది.


సింఘు సరిహద్దులో రైతుల దీక్ష గురించి విభిన్నమైన కోణాల్లో రాస్తున్న మన్‌దీప్‌ పునియా, ఆయన సహచరుడు దర్మేందర్‌ సింగ్‌ కూడా ఇటువంటి 'శిక్ష'కు గురయ్యారు. రైతు వార్తలను ప్రారంభం నుండి చురుకుగా ఇస్తున్న ఫ్రీలాన్స్‌ జర్నలిస్టులు వీరిద్దరు. స్థానికుల పేరుతో బిజెపి గూండాలు రైతుల శిబిరాలపై ఎలా దాడి చేసిందీ వారు తమ దగ్గర ఉన్న కెమెరా, మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసి చూపించారు. అందుకని బిజెపి పోలీసులు రాత్రికి రాత్రి వారిని అరెస్టు చేసి ''విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి చేశారు' అన్న నేరారోపణ చేశారు. జైల్లో పెట్టి చితక్కొట్టారు. కెమెరాలు విరగ్గొట్టారు. కుటుంబంతో మాట్లాడ్డానికి అనుమతివ్వలేదు. ఉన్న కాస్త ధైర్యం దిగిపోయి, అధికారుల ముందు మోకాళ్ల మీద నిలబడ్డానికి ఈ నిర్బంధం చాలదూ? కానీ యువ జర్నలిస్టులు లొంగిపోలేదు. రైతు ఉద్యమకారులతో కలిసి తీహార్‌ జైల్లో ఉన్న మన్‌దీప్‌ పునియా దెబ్బలతో కందిపోయిన తన కాళ్లూ, చేతుల మీదనే జైలులో రైతులు చెప్పిన కథనాల నోట్సు రాసుకున్నాడు. బెయిలుపై బయటకు వచ్చిన తరువాత ఆయన ఆ నోట్సు ఆధారంగా మళ్లీ కథనాలు రాసి పంపాడు. ''నా కాళ్ల మీద విపరీతంగా కొట్టారు. దెబ్బలు తిన్న కాళ్ల మీదనే నేను నా జర్నలిజం కోసం నోట్సు రాసుకున్నాను'' అని పునియా ట్వీట్‌ చేశాడు.


రైతు ఉద్యమానికి ముందు నుండి విస్తృత ప్రచారం కల్పిస్తున్న వెబ్‌ పోర్టల్‌ 'న్యూస్‌ క్లిక్‌' మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఫిబ్రవరి 9న దాడి చేశారు. న్యూస్‌ పోర్టల్‌ ప్రధాన సంపాదకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ, వ్యవస్థాపక భాగస్వామి ప్రముఖ సాహితీవేత్త గీతా హరిహరన్‌లను 96 గంటలపాటు నిర్బంధంలో ఉంచారు. 73 ఏళ్ల పుర్కాయస్థ ప్రముఖ శాస్త్రవేత్త, 67 ఏళ్ల గీతా హరిహరన్‌ తన కథల సంపుటి ''ది థౌజండ్‌ ఫేసెస్‌ ఆఫ్‌ నైట్‌''కు 1993 కామన్వెల్త్‌ ఉత్తమ పుస్తకం బహుమతి పొందారు. వారిపై ఎందుకు దాడి చేశారో ఏమిటో అధికారికంగా సమాచారం చెప్పలేదు. కానీ కొన్ని కార్పొరేట్‌ పత్రికలకు పనిగట్టుకుని న్యూస్‌ క్లిక్‌ ప్రతిష్టను దిగజార్చే విధమైన తప్పుడు 'వార్త' లీక్‌ చేశారు. 2009 నుండి ప్రజా ఉద్యమాలపై అద్భుతమైన విశ్లేషణలు చేస్తున్నందుకు దేశాన్ని పాలిస్తున్న చీకటి శక్తులు వారికి విధించిన 'శిక్ష' ఇది.


జనవరి 26న ఎర్రకోట వద్ద కొంతమంది 'సర్కారీ' స్పాన్సర్డ్‌ రైతులు సృష్టించిన హింస, అవాంఛనీయ చర్యల నేపథ్యంలో ''ది వైర్‌'' వ్యవస్థాపక సంపాదకుడు సిద్ధార్ధ వరద రాజన్‌, రిపోర్టర్‌ ఇస్మాత్‌ ఆరాలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఘటనల్లో పోలీసు కాల్పుల్లో ఒక యువ రైతు చనిపోయినట్లు రైతు తల్లిదండ్రులు చెప్పిన తొలి వార్తను వీరు ట్వీట్‌ చేశారు. తరువాత ఆ రైతు పోలీసు కాల్పుల్లో కాకుండా ట్రాక్టర్‌ తిరగబడి చనిపోయినట్లు 'నిర్ధారణ' అయింది. ఏదైనా ఒక వార్త పూర్తిగా నిర్థారణ అయ్యేలోపు దశల వారీ సమాచారం రావడం, దాన్ని మీడియాలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం సహజం. కానీ తల్లిదండ్రులను ఉటంకించినందుకు గాను కుట్ర సిద్ధాంతంతో కేసు నమోదు చేయడం వెనుక ఉన్నది ప్రజా రిపోర్టింగును అణచివేయాలన్న కుట్ర మాత్రమే.


వీరు గాక అనంత్‌నాథ్‌, ఇండియా టుడేకు చెందిన రాజ్‌దీప్‌ సర్దేశాయి, జాఫర్‌ ఆఘా, ప్రశాంత్‌ కనోజియాలతో సహా ఇటీవల రైతు ఉద్యమ వార్తలు రాస్తున్న 9 మంది జర్నలిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అంటే రైతు ఉద్యమాన్ని అణచివేయాలంటే ముందుగా భావ ప్రకటనా స్వేచ్ఛ మీద దాడి చేయడం అవసరమని ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.


ఇటీవల ఉత్తరప్రదేశ్‌ లోని హత్రాస్‌లో దళిత యువతిపై అతి కిరాతకంగా జరిగిన అత్యాచారం కేసు వార్త సేకరించడానికి వెళుతున్న మళయాళం జర్నలిస్టు సిద్ధిఖి కప్పన్‌ను యు.పి పోలీసులు 'చట్ట విరుద్ధ చర్యల నిరోధక చట్టం' (ఉపా) కింద అరెస్టు చేసిన సంగతి మనకు తెలుసు. ఆయన నాలుగు మాసాలు జైలులో ఉన్నాడు. బిజెపి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నందుకు 2017లో గౌరీ లంకేశ్‌ను హత్య చేసిన విషయమూ మనకు తెలిసిందే. జమ్మూ-కాశ్మీర్‌ వార్తలు సేకరించే పాత్రికేయుల పైన కూడా బిజెపి ప్రభుత్వం ఇటువంటి నిర్బంధాలు ప్రయోగిస్తోంది.


అంతర్జాతీయ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బెర్గ్‌ ట్వీట్‌ను షేర్‌ చేసినందుకుగాను బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల దిశా రవి పై దేశ ద్రోహం నేరం మోపడం పట్ల అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత దేశంలో మీడియా స్వేచ్ఛపై నగంగా జరుగుతున్న దాడులు దేశ ప్రతిష్టను బాగా దిగజారుస్తున్నాయి. గతంలో ప్రభుత్వాల హయాంలో కూడా మీడియా స్వేచ్ఛపై దాడులు జరిగాయి. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దాడులు 30 శాతం పెరిగాయని అధికారిక గణంకాలు తెలుపుతున్నాయి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత దేశ స్థానం ప్రతి ఏటా పడిపోతూ వస్తోంది. గత ఏడాది రెండు పాయింట్లు తగ్గింది. పత్రికా స్వేచ్ఛ హీనస్థితిలో ఉన్న 180 దేశాల్లో మనం 142వ స్థానంలో ఉన్నామంటే బిజెపి ప్రభుత్వం భారతదేశ పరువు ఎంతగా తీసేస్తున్నదో అర్ధమవుతుంది.


పాత్రికేయులపైనా, మీడియాపైనా ప్రభుత్వ అణచివేతలను మీడియా వాచ్‌డాగ్‌ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ చర్యలు సెన్సార్‌ కిందకు వస్తుందని పేర్కొన్నాయి. ''జర్నలిస్టులపై కేసులు పెట్టడం అనేది వారిని వేధించేందుకు, బెదిరించేందుకు, మీడియా మెడలు వంచేందుకు చేస్తున్న పనే'' అని ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది. ''ప్రభుత్వం తను కోరుకున్నట్లు మీడియాను నడపదలచుకుంది'' అని 'రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌' ఆసియా పసిఫిక్‌ డెస్క్‌ విమర్శించింది.


ప్రభుత్వ వార్తలతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాల వార్తలను సేకరించి ప్రజలకు అందించడం పత్రికల బాధ్యత. ఈ బాధ్యతలు నిర్వహించే పాత్రికేయులను నిర్బంధించడం, కేసులు పెట్టడం, వేధించడం అంటే ప్రజాస్వామ్యానికి అడ్డుకట్టలు వేయడమే. మీడియా స్వేచ్ఛను అరికట్టడం ప్రజల ప్రజాస్వామిక హక్కులను హరించడమే. మనం మేల్కొని నిరసన గళం విప్పకపోతే నియంతృత్వ రాజ్యానికి ఇది బాటలు వేస్తుంది.
                                                                        * ఎస్‌.వెంకట్రావు