Mar 20,2021 07:04

బీమా అంటేనే భవితపై ఒక ధీమా. అనుకోని ఆపదొస్తే, ప్రకృతి ప్రకోపిస్తే, ఆర్థిక సంక్షోభాలేవైనా ముంచుకొస్తే వాటిని సంబంధిత బాధితులే కాకుండా సమాజం మొత్తం ఉమ్మడిగా ఎదుర్కొని కొండంత అండగా నిలిచేలా రూపొందించుకున్న ఒక చక్కటి వ్యవస్థ బీమా రంగం. కేంద్రం లోని మోడీ సర్కార్‌ ఇప్పుడు ఆ బీమా రంగాన్నే ప్రయివేటుకు కట్టబెట్టి ప్రమాదంలోకి నెట్టేస్తోంది.


మన దేశంలో బీమా రంగంపై తొలినాళ్లలో ప్రయివేటు పెత్తనమే నడిచింది. వరుస కుంభకోణాలు, అవినీతిలో కూరుకుపోయిన బీమా రంగాన్ని ప్రయివేటు కబంధ హస్తాల నుంచి విడిపించేందుకు నాడు బీమా రంగ ఉద్యోగులే ఉద్యమించారు. విశాల ప్రజా ప్రయోజనాల కోసం బీమా రంగం ప్రభుత్వంలో ఉండాలన్న డిమాండ్‌తో నాడు కార్మిక, ప్రజా సంఘాల సంఘటిత పోరాటాల ఫలితంగానే 1956లో జీవిత బీమా రంగాన్ని 1971లో సాధారణ బీమా రంగాన్ని జాతీయం చేశారు. కేవలం రూ.5 కోట్ల మూలధనంతో ప్రారంభమైన ఎల్‌ఐసి ఇప్పుడు లక్షల కోట్ల సంపదతో విరాజిల్లుతోంది. ఆర్థిక సంక్షోభం, కరోనా విపత్తు వంటి వరుస కడగండ్లతో ప్రపంచమంతా అతలాకుతలమౌతున్నా భారత్‌ ఆర్థిక శక్తిగా మనుగడ సాగించగలుగుతోందంటే దానికి కారణం బీమా, బ్యాంకింగ్‌ రంగం ప్రభుత్వ రంగంలో ఉండటమే. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ బీమా రంగం, ప్రభుత్వ బ్యాంకులు ఎనలేని నిధులు సమకూర్చి దేశసేవలో పునీతమయ్యాయి. ప్రజల క్లయిములను సకాలంలో పరిష్కరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక సంస్థలుగా మన్ననలు పొందుతున్నాయి. నయా సరళీకరణ విధానాలు అమల్లోకి వచ్చిన నాటి నుంచి వీటిని తిరిగి ప్రయివేటుకు అప్పగించే ప్రయత్నాలను పాలకులు కొనసాగిస్తూ వచ్చారు. కానీ ప్రయివేటు శక్తుల ఆక్రమణ ఆగడాలను తిప్పికొడుతూ ఇప్పటివరకూ పరిరక్షిస్తూ వచ్చింది పోరాటాలే. ఇకముందు కూడా వాటిని నిలబెట్టేదీ ఆ పోరాటాలే.


దేశ భవిష్యత్తు ఒడిదుడుకుల్లో ఆర్థిక సుడిగుండాల్లో చిక్కుకోకుండా ఉండాలంటే ఎల్‌ఐసి ప్రభుత్వ రంగంలోనే ఉండాలంటూ ఉద్యోగులు గురువారం దేశ వ్యాపిత సమ్మె చేపట్టారు. సరిగ్గా అదే రోజు బీమా రంగానికి గొడ్డలిపెట్టు వంటి ఇన్సూరెన్స్‌ చట్ట సవరణ బిల్లును ప్రతిపక్షాల వాకౌట్‌ మధ్య రాజ్యసభలో మోడీ సర్కార్‌ మూజువాణి ఓటుతో ఆమోదించిందంటే కార్పొరేట్‌ కంపెనీలకు కేంద్రం ఎంతగా లొంగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణ వల్ల అదనపు ప్రజా ప్రయోజనం నెరవేరిన ఘటన ప్రపంచంలో మచ్చుకైనా కానరాదు. భారతీయ స్టేట్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ లాంటి నిపుణులు ఈ విషయాన్ని లేవనెత్తి బ్యాంకులు, బీమా వంటి ఆర్థిక సంస్థలు ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. కానీ ఆర్థిక నిపుణులు మాటలను చెవికెక్కించుకుంటే అది మోడీ సర్కార్‌ ఎందుకు అవుతుంది?


ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నిరంతరం పోరు సల్పుతున్న వామపక్షాలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించి చట్టసభల్లోనూ ప్రజాగళాన్ని గట్టిగానే వినిపించాయి. కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రధాన పార్టీలు నోరు మెదిపి మెదపలేక విశేష నటనాకౌశలాన్ని ప్రదర్శించాయి. కార్పొరేట్‌ సంస్థలకు బిజెపి మడుగులు ఒత్తితే ...ప్రాంతీయ పార్టీలుగా కనీస ప్రతిఘటన కూడా చూపకుండా వైసిపి, టిడిపి, టిఆర్‌ఎస్‌ కాషాయ పార్టీకి మోకరిల్లడం దుర్మార్గం. సభలో వైసిపి తరపున చర్చలో పాల్గొన్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బిల్లు వల్ల కలిగే నష్టాలు ఏకరవు పెట్టారు. ఇంత నష్టముందని చెబుతూనే.. అయినా కూడా బిల్లుకు తాము మద్దతిస్తున్నామని నిండు సభలో ప్రకటించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టిడిపి గోడ మీద పిల్లిలా వ్యవహరించాయి. ప్రజల ప్రయోజనాల రక్షణ కోసం నిలబకుండా కార్పొరేట్ల వైపే ఈ పార్టీలు మొగ్గు చూపుతున్నారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.


'స్వదేశీ సరుకులను ప్రోత్సహిద్దాం' (వోకల్‌ ఫర్‌ లోకల్‌) అంటూ మాటల్లో దేశభక్తిని చాటింపు వేయించుకునే బిజెపి చేతల్లో మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను విదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతోంది. దుర్మార్గపు చర్యలను అడ్డుకోవడానికి కార్మిక, ఉద్యోగ సంఘాల సంఘటిత పోరాటాలకు వెన్నుదన్నుగా ప్రజలు నిలవాలి.