
శిథిలావస్థకు చేరి పెచ్చులూడుతున్న వైనం
భయాందోళనలో ఉద్యోగులు
ప్రజాశక్తి - ఆకివీడు
స్థానిక ఆనాల చెరువు వద్ద పెద్దపేటలో ఉన్న పాత బిసి హాస్టల్ భవనం పెచ్చులూడిపోయి ప్రమాదకరంగా మారడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయం నెలకొంది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. అందులో పిల్లలు నివసిస్తే ప్రమాదవని అధికారులు నిర్ణయించిన అనంతరం సుమారు ఐదేళ్ల క్రితమే అదే ప్రాంగణంలో సంక్షేమ శాఖ మరో భవనం నిర్మించింది. విద్యార్థులను ఆ భవనంలోకి పంపించారు. అయితే అప్పటినుంచి ఆ భవనం ఖాళీగానే ఉంది. సుమారు సంవత్సరంన్నర క్రితం ఇక్కడ సచివాలయ కార్యాలయాలు విడగొట్టడంతో ఒక కార్యాలయాన్ని ఈ భవనంలో ప్రారంభించారు. ఆకివీడు -1 కార్యాలయాన్ని సుమారు ఒకటిన్నర సంవత్సరంగా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రాంగణం మొత్తం మురికి మయంగా తయారైంది. మొత్తం వర్షపు నీరు, మురికి నీటితో ఉద్యోగులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవనంలో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ భయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఏ నిమిషంలో ఏ భాగం ఊడి ఎవరి నెత్తి మీద పడుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు ఇక్కడికి రావడానికి ధైర్యం చేయడం లేదు. హాస్టల్ పిల్లలు ఎప్పుడైనా ఎవరైనా ఇటు వస్తే ప్రమాదానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. విద్యార్థులు నివసించడానికి పనికిరాదన్న భవనం ప్రజా కార్యాలయంగా మార్చడం విచిత్రంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.