ప్రజాశక్తి-పంగులూరు: ఒకప్పుడు విద్యార్థులు ఆ భవనంలో కూర్చొని చక్కగా చదువుకున్నారు. అయితే ఇప్పుడు ఆ భవనం శిథిలావస్థకు చేరి, ఎప్పుడు కూలిపోతుందో, ఎవరికి ఏ ప్రమాదం జరుగుతుందో అనే ఆందోళన విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ కలుగుతోందని అన్నారు. భవనాన్ని తొలగించమని ఉపాధ్యాయులు ఏళ్ల తరబడి వేడుకుంటున్నా, అటు అధికారులు గానీ, ఇటు రాజకీయ నాయకులు గానీ పట్టించుకోవడం లేదు. భవనాన్ని కూల్చటానికి ఆ అధికారి పర్మిషన్ కావాలని కొంతకాలం, ఈ అధికారి పర్మిషన్ కావాలని కొంతకాలం, కాలయాపన చేస్తున్నారు. పంచాయతీ పాలకవర్గం కూడా ఆ ప్రమాదాన్ని గుర్తించినట్లు లేరు. అయితే విద్యార్థులు ఆ భవనం పక్కగా వెళుతున్న ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలవుతోంది. ఏ ప్రమాదం జరుగుతుందోనని ఎప్పటికప్పుడు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని అలవలపాడు గ్రామంలో 1975 ప్రాంతంలో మూడు గదులతో ప్రాథమిక పాఠశాలను నిర్మించారు. కొంతకాలం వరకూ బాగానే ఉన్న పాఠశాల, గత 7 సంవత్సరాల కాలంలో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆ భవనంలోకి తీసుకెళ్లటం మానుకున్నారు. గత నాలుగేళ్లుగా ఆ భవనం ఖాళీగా ఉంటోంది. అందులో ఒక గదిని పగులగొట్టి టాయిలెట్స్‌ను రెండు సంవత్సరాల క్రితం నిర్మించారు. ఇంకా రెండు గదులు ఖాళీగానే ఉన్నాయి. అయితే ఈ భవనం పూర్తిగా శిథిలమైంది. ఎప్పుడు ఏది విరిగి పడుతుందోనని, ఏ ప్రమాదం రానుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఉపాధ్యాయులు అటు అధికారులకు, ఇటు రాజకీయ నాయకులకు విన్నవించుకున్నా ఫలితం కనబడలేదు. అధికారులు ఎంపిడిఓ పర్మిషన్ కావాలని కొంతకాలం, ఎంఈఓ పర్మిషన్ కావాలని కొంతకాలం, డిఈఓ పర్మిషన్ కావాలని కొంతకాలం కాలయాపన చేస్తూ వచ్చారు. పంచాయతీ పాలకవర్గం కూడా దీన్ని పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు క్షణ క్షణం.. భయం భయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు భవనాన్ని పరిశీలించి వెంటనే దాన్ని తొలగించాలని ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెలిపారు.










