Sep 11,2023 00:27

మలుపు ఉన్న రహదారి

ప్రజాశక్తి-కోటవురట్ల:మండల కేంద్రం నుండి అడ్డరోడ్డు ప్రయాణం అంటే అవస్థలు పడుతున్నారు మండల వాసులు. ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదవ సంవత్సరంలోకి అడుగుడినా అడ్డురోడ్డు వెళ్లే దారిలో రామచంద్రపురం నుండి అడ్డరోడ్డు వెళ్లే వరకు మలుపులతో అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా రాత్రి సమయంలో ప్రయాణం నరకప్రాయం. ఒకపక్క గోతులు, మరోవైపు మలుపులు, దీనికి తోడు తుప్పలు. నిత్యం ఏదో ఒక పనిపై ఇదే రోడ్డుపై స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు సహా డివిజన్‌ స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు నిత్యం ప్రయాణిస్తూనే ఉంటారు. అయినా కనీసం రోడ్డు గురించి పట్టించుకోలేదని స్థానికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇందేసమ్మవాక వద్ద నుండి అడ్డు రోడ్డు వెళ్లే వరకు ఏ క్షణాన ఏ ప్రమాదం సంభవిస్తుందోనని భారీ వాహనాలు సహా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.పోలవరం కాలువ వద్ద రోడ్డు సమీపంలో గొయ్య ప్రమాదకరంగా దర్శనమిస్తుంది. రోడ్డుకు ఇరువైపులా వైన్డింగ్‌ నిమిత్తం గోతుల తవ్వి వదిలేయడంతో కనీసం అధికారులు సైతం పట్టించుకోకపోవడం దారుణమంటూ ఆయా ప్రాంతవాసులు తీవ్ర విమర్శలు గుర్తిస్తున్నారు. అధికారులు నాయకులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి తక్షణమే పనులు ప్రారంభించాలని కోరుకుంటున్నారు.