Dec 18,2021 06:51

రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వాలు ఏవైనా చట్టాలు చేసినా, చర్యలు చేపట్టినా వాటిని అడ్డుకొని రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాల్సిన న్యాయ వ్యవస్థలో ఇటీవల ఆ రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే పోకడలు ముందుకు రావడం ఆందోళనకరం. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ 'ఆదివక్త పరిషత్‌' ఇటీవల నిర్వహించిన 'ధర్మ - భారత రాజ్యాంగం : పరస్పర దార్శనికత' సదస్సులో జమ్ముకాశ్మీర్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిథాల్‌ చేసిన వ్యాఖ్యలు ఆ కోవకే చెందుతాయి. రాజ్యాంగ పీఠికలోని సామ్యవాదం, లౌకికవాదం పదాల వల్ల భారత్‌లో ఆధ్యాత్మిక భావన విస్తరణకు నోచుకోకుండా కుంచించుకుపోయిందన్నది ఆయన ఆవేదన! సామ్యవాద లక్షణం భారత్‌లో అనాదిగా నిబిడీకృతమైన భావన అని, ప్రజలందరి బాగోగులనూ చూసుకునే శక్తి ఉందని ఆయనే చెప్పారు. అలాంటప్పుడు ఇక సామ్యవాదం పదంతో వచ్చిన ముప్పేమిటి? పైగా పాండవులు మొదలు మౌర్యులు, గుప్తులు, మొఘలులు, చివరకు ఆంగ్లేయులు వరకు ఎంతమంది పాలన సాగించినా ఏనాడూ ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అనే చీలికలు రాలేదట! ఆధ్యాత్మిక దేశంగా వారంతా భారత్‌ను ఆమోదించినందునే ఇది సాధ్యమైందని ఆయన చెప్పుకొచ్చారు. స్వతంత్ర సంగ్రామంలో చిల్లిగవ్వంత పాత్ర కూడా లేని సంఫ్‌ు పరివార్‌ సదస్సులో ప్రసంగించే వ్యక్తులకు.. మతం పేరిట ప్రజలను చీల్చి చెండాడిన ఆంగ్లేయుల అరాచకాలు స్మరణకు రాకపోవడంలో వింతేముంది? సెక్యులర్‌ అనే పదం సంకుచిత వైఖరితో కూడినదనేది ఆయన వ్యక్తం చేసిన మరో ఆవేదన! అనాదిగా అధ్యాత్మిక దేశంగా పరిఢవిల్లిన దేశం పేరు కచ్చితంగా 'ఆధ్యాత్మిక గణతంత్ర భారత్‌'గా ఉండి తీరాలట! రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన న్యాయమూర్తి నోట ఇటువంటి వ్యాఖ్యలు వెలువడటం రాజ్యాంగ విరుద్ధం కాదా?
భావ ప్రకటనా స్వేచ్ఛ సాధారణ పౌరులతో పాటు న్యాయపాలికలకూ ఉంటుంది. కానీ ఆ భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించిన రాజ్యాంగాన్నే దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం సమర్థనీయమా? అందునా న్యాయమూర్తులు వంటి అత్యున్నత పదవుల్లో ఉన్నవారు...రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినవారు అలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన వ్యక్తి ఆ రాజ్యాంగ మౌలిక స్ఫూర్తినే మంటగలిపే విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేయడం కంటే నేరమేముంటుంది? పరుల పట్ల సహనం, ప్రశ్నించేతత్వం, ప్రజలందరూ సమానంగా ఉండాలనే సామ్య వాదతత్వం ఇతిహాసాల్లోనూ, ఆధ్యాత్మిక సాహిత్యంలోనూ కోకొల్లలుగా ఉండవచ్చు. కానీ మనుధర్మ మదాంధకారంలో పెత్తందారి పాలకగణం అణగారిన ప్రజలపై ఈనాటికీ సాగిస్తున్న అరాచకాలను సాహితీ ఉద్గ్రంథాలేవీ అడ్డుకోలేకపోయాయి. సర్వ అరిష్టాలకు మూలమైన ఆ మనుధర్మమే శాసనంగా ఉండాలనే హిందూత్వ ఎజెండాకు న్యాయపాలికలు వంత పాడటం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది.
శాసన వ్యవస్థ (చట్టసభలు), కార్యనిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం), న్యాయ వ్యవస్థ మూడు కూడా రాజ్యాంగానికి లోబడి వేటికవే స్వతంత్ర వ్యవస్థలు. రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శనంలో ప్రజాస్వామ్యయుతమైన పాలన ద్వారా ప్రజా సంక్షేమానికి, దేశాభివృద్ధికి కృషి చేయడమే మూడింటి ప్రధాన కర్తవ్యం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బృహత్‌ కర్తవ్యం న్యాయవ్యవస్థది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన న్యాయవ్యవస్థ ఇలా పాలకుల ఒత్తిళ్లకు లొంగిపోయి చౌకబారు, మూఢత్వ భావనలను జొప్పించాలనుకోవడం సరికాదు. అయోధ్య-బాబ్రీ మసీదు కేసు లోనూ మత మౌఢ్యపు విశ్వాసాలే ప్రాతిపదికలయ్యాయి. శబరిమల, శని శిగ్నాపుర్‌ ఆలయాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసుల్లోనూ మతతత్వ సంప్రదాయాల విరగబాటుకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు సమాధైపోయాయి. అయోధ్య తీర్పు వెలువరించిన ఓ న్యాయమూర్తి పదవీ విరమణ పొందిన వెనువెంటనే ప్రభుత్వ పదవి పొందడం వంటి పరిణామాలు న్యాయ వ్యవస్థ నిష్పాక్షికతనే ప్రశ్నార్థకం చేశాయి. సామ్యవాదం, లౌకికవాదం ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది వంటివి. రాజ్యాంగ పునాదులనే సవాలు చేసే తీవ్ర వ్యాఖ్యలు చేసన న్యాయమూర్తి ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత కొల్పోయారు. రాజ్యాంగ పరిరక్షులుగా రాష్ట్రపతి సదరు న్యాయమూర్తిని తక్షణమే తొలగించాలి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా న్యాయవ్యవస్థే తనను చక్కదిద్దుకోవాలి. తద్వారా రాజ్యాంగ లౌకిక, ప్రజాస్వామ్య సారాన్నీ పరిరక్షించాలి.