ప్రజాశక్తి - చిలకలూరిపేట : ఆ కార్యాలయంలో 15 మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఆ కార్యాలయం మీద ఆధారపడి 30 మంది వరకు స్టాంప్ వెంటర్లు, దస్తావేజు లేఖర్లు ఆ పరిసరాల్లోనే పని చేస్తుంటారు. వీరు కాకుండా మరో 500 మంది వరకు మధ్య వర్తులు, వందలమంది కక్షిదారులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. రోజుకు 70 నుండి 120 వరకూ డాక్యుమెంట్లు ఈ కార్యాలయంలో రిజిస్టర్ అవుతుంటాయి. దీనిద్వారా ప్రభుత్వానికి రూ.30 లక్షలకు పైగానే ఆదాయం వస్తుంటుంది. అయితే సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో లేవు.
స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కనీస వసతులు లేకపోవడంతోపాటు 1926 నాటి నిర్మాణం కావడంతో భవనం దెబ్బతింటోంది. దంతెలతో అడ్డంగా దూలాలను పెట్టి దానిపై సున్నం, బంక మట్టితో నిర్మించారు. దూలాలపై సున్నపు లాజ్‌తో స్లాబ్ వేశారు. అయితే పురాతన భవనం కావడం, దీర్ఘకాలంగా మరమ్మతులు లేని కారణంగా దూలాలు ఊడిపోయే దశకు చేరుకున్నాయి. గోడలు పెచ్చులూడుతున్నాయి. కొన్ని విషయపురుగులు సైతం గోడ పగుళ్లలోకి చేరుతున్నాయి. కార్యాలయానికి వివిధ అవసరాల నిమిత్తం వచ్చేవారు పలు సందర్భాల్లో పురుగులను చూసి భయాందోళనలకు గురైన సందర్భాలు అనేకం. మరోవైపు అప్పుడప్పుడూ పెచ్చులూడు తుంటాయని, అవి తమమీద పడతాయేమోనని కక్షిదారులు, వెండర్లు, రైటర్లు భయపడుతూన్నారు. స్లాబ్ సైతం పగుళ్లు రావడంతో వర్షం పడినప్పుడు వాటి నుండి నీరు కార్యాలయంలోకి వస్తోంది. ఈ నీటి వల్ల దూలాలూ మరింత బలహీనం అవుతున్నాయి. అవి ఊడిపడిపోతాయేమోనని సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా కార్యాలయంలో ఫ్యాన్లు సరిగా పనిచేయకపోవడం, తాగునీటి వసతి లేమి, కూర్చోవడానికి కూర్చీలైనా లేక కక్షిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో భవనానికి పటిష్టంగా మరమ్మతులైనా చేయించాలని, కొత్త భవనమైనా నిర్మించాలని, సదుపాయాలు సైతం సమకూర్చాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.










