పట్టించుకోని మున్సిపల్ అధికారులు
ప్రజాశక్తి - నాయుడుపేట
నాయుడుపేటలో వ్యాపారులు అడ్డగోలుగా వ్యాపారాలు సాగిస్తున్నారు. వారిష్టమొచ్చినట్లు రేట్లు పెంచుకోవచ్చు.. వారికనుగుణంగా రోడ్డుకడ్డంగా వ్యాపార ప్రకటనల బోర్డులను పెట్టొచ్చు.. ఎవరైనా వాహనదారులు, సామాన్యులు ప్రశ్నిస్తే 'మా ఇష్టం... మేం ఇలాగే అమ్ముతాం... ఇలాగే బోర్డులు పెడతాం... మీకెందుకు' అని వాగ్వివాదానికి దిగుతారు. వినియోగదారుడు ఎవరికైనా మొరపెట్టుకుందామనుకుంటే ఎవ్వరూ కనిపించరు. ఏ అధికారికైనా చెప్పుకొంటే అది మా డిపార్ట్మెంట్ కాదు అనేది వారినుంచి వచ్చే సమాధానం. ఇది నాయుడుపేట ప్రజల పరిస్థితి. డిఎస్‌ఆర్ కల్యాణ మండపం ఎదురుగా ఒక పేద మహిళ పేదలకు ఎన్‌ఆర్‌జెసి బ్యాంక్ ఖాతాలు చేయించడం కోసం రోడ్డుకు సుమారు పదిహేను అడుగులు లోపలకి చిన్న పాక వేసుకుంటే కొంత మంది రాజకీనాయకుల కోసం ఆ పాకను క్షణాలలో తొలగించిన మునిసిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఇంత ప్రమాద కరమైన అడ్డంకులు ఎందుకు కనిపించటం లేదన్నది తెలపాల్సిన అవసరం ఉంది. ఆమెకు ఎదురుగానే ఉన్న ఫర్నిచర్ షాపులు వారు కుర్చీలు, సోఫాలు, ఒక్కటేమిటి ఆ షాపుల్లో అమ్మే వస్తువులు ప్రదర్శనకోసం రోడ్ల పైనే పెట్టేసి వ్యాపారం చేస్తుంటే సదరు కమిషనర్ కు అవి మాత్రం కనిపించవు. లెక్కకు మించి ఉన్న మునిసిపల్ కార్మికులు, అధికారులు పట్టణమంత తిరుగడుతుంటారే గాని వీటిపై ఎందుకో శ్రద్ధ చూపటం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నాయుడుపేటలో సెజ్, కోర్టు, ఆర్డీవో కార్యాలయం ఇలా అనేక కార్యాలయాలతో అధికారికంగా అభివద్ధి చెందుతుండడంతో రహదారికి ఇరువైపులా హోటళ్లు, దాబాలు, కేఫ్‌లు, బేకరీలు, కూల్‌డ్రింక్ షాపులు, ఫర్నీచర్ షాపులు ఇలా అధిక శాతంలో అనేక రకాల షాపులు విపరీతంగా వెలిశాయి. ఈ పోటీలతో వాహనదారులు అనేకరకాల ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. వీరి మధ్య పోటీ రేట్లలో కాదు, వారి షాపులు బయటకు కనిపించాలనుకోవటంలో. అందువల్ల వారు రోడ్లపైకి వచ్చేసి బోర్డులు నాటుతూ రోడ్డు పక్కన ద్విచక్ర వాహనం వెళ్లే జాగాకూడా మిగల్చడంలేదు. అందువల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడవలసిన పరిస్థితి ఏర్పడింది. అయిన వీరికి వారి వ్యాపారం జరగడం ఒక్కటే ముఖ్యం. ఎవరు ఎలా ఇబ్బంది పడినా పట్టించుకోరు.
ఈ కోవలో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ పరిధిలో గల ఎఫ్ 2 కేఫ్ గురించి. మొదలే అది రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డు. మంచి బిజీ సెంటర్. పైగా టర్నింగ్ కూడా. ఈ ఎఫ్ 2 కేఫ్ చూసేందుకేమో రోడ్డుకు పదిహేను అడుగులు లోపలికే ఉంటుంది. కానీ బయట కూర్చునేందుకు కుర్చీలు వేసేసి కేఫ్ లోకి వచ్చే వారి వాహనాలకు పార్కింగ్ మాత్రం రోడ్డుపై వారి సొంత స్థలంలా విపరీతంగా పెట్టిస్తారు. ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఇదేమని ఏ అధికారి అటువైపు కన్నెత్తైన చూడడు. ఇక శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు లోని హౌటళ్ల పరిస్థితైతే సరే సరి. రోడ్డుపై బోర్డులు పెట్టటమే కాదు రోడ్డుకడ్డంగా వాహనాలు నిలిపేసినా పట్టించుకునే నాధుడే లేడు. ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల హౌటల్ అమరావతి వద్ద నిలిచే వాహనాలు చూస్తే నోరెళ్ళబెట్టాల్సిందే. ఇటు ఆర్టీసీ బస్సులు బయటకు లోపలికి తిరిగే స్థలం. అందునా విజయవాడ- బెంగుళూరు రోడ్డు. లారీలు, ప్రయివేటు బస్సులు, కార్లు ఇలా వేలకొలది వాహనాలు నిత్యం గ్యాప్ లేకుండా ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాయి. అటువంటి రద్దీగా ఉన్న చోట ఇంత పెద్ద హౌటల్ తగినంత కనీసం రెండు మూడు కార్లు కూడా పట్టేంత పార్కింగ్ స్థలం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొన్నికొన్ని సార్లు ఈ హౌటల్ నిర్వహణ వల్ల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన ఉదంతాలు ఎన్నో లేకపోలేదు. వాహనాలు ఎంత ఆగితే అంత వ్యాపారం జరుగుతుంది అన్న చందాన కనిపిస్తుంది వీరి ధోరణి. ఈ కోవలోనే గ్రీన్ చిల్లీస్ డాబా, కొత్తగా వెలసిన అన్నపూర్ణ హౌటల్. ఈ హౌటల్ వాళ్ళు అందరికన్నా మేమెమన్న తక్కువ అన్నట్టు హౌటల్ బోర్డు మరికొంత ముందుకొచ్చి పెట్టడం గమనార్హం. ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం ఇప్పుడున్న వాహనాలకు పది శాతం వాహనాలు కూడా లేనప్పుడు నిర్మించిన రోడ్డు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. కానీ ఉన్న ఆ కొద్దిపాటి రోడ్డునుకుడా వీరు వ్యాపారాల పేరిట అక్రమించేసి విపరీత ధోరణి ప్రదర్శిస్తున్నారు. పట్టణంలోని అడ్డంకులను తొలగిం చాల్సిన మునిసిపల్ శాఖకు ఇలాంటివి కనిపించటంలేదా అంటూ పట్టణ ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. పోనీ పోలీసులన్న అటు చూస్తారా అంటే వారికసలు అవసరం లేనట్టు కనిపిస్తుంది. కనీసం నాయకులైన పట్టించుకుంటారా అంటే అదీ లేదు. ఎందుకంటే అక్కడ ప్యాపరాలు చేస్తున్నవారిలో సగానికి పైగా వారి బంధు వులు, అనుచరులే. ఇలా ఈ కారణంగానే అధికారులు నాయకుల కోసం వారి బాధ్యత నిర్వర్తించకుండా ఒకరిపైఒకరు చెప్పుకుంటు కాలం గడిపేస్తున్నారే తప్ప సమస్యలకు పరిష్కారం చూపటం లేదన్నది కనిపిస్తున్న వాస్తవం. ప్రమాదాలు జరిగి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తకముందే అధికారులు కళ్ళు తెరచి ఇలాంటి ప్రమాదకరమైన అడ్డంకులను తొలగించాలని వాహనదారులు ప్రజలు వేడుకుంటున్నారు.










