పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలో ఆవుల సంచారం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. పట్టణంలో ఎక్కడ చూసినా ఆవులు గుంపులు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. వీటిని వేగ నిరోధకాలుగా వాహన చోదకులు భావిస్తున్నారు. ఇవి ఎక్కడపడితే అక్కడ రోడ్డుకు అడ్డంగా పడుకుని ఉండడం వల్ల చాలాసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. అలాగే వాహనాలు ఢకొీని గోవులు కూడా గాయపడిన రోజులు ఉన్నాయి. వీటి నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నిస్తే లేదనే సమాధానం ప్రజల నుంచి వినవస్తోంది. వీటి వల్ల ప్రమాదం అనే మాట అటు ఉంచితే ఇవి జబ్బుల పాలవుతున్నాయి. ముఖ్యంగా నిషేధిత ప్లాస్టిక్ కవర్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాయి. ఒకవేళ ఆవులు ప్రమాదాల వల్ల గాయపడితే పట్టించుకునే వారు కూడా కరువయ్యారు. గాయాలపాలైన ఆవులను ఎవరు పట్టించుకోని కారణంగా వాటికి పురుగులు కూడా పడుతున్నాయి. ఈ పరిస్థితిలో స్నేహిత అమృత హస్తం సేవా సమితి సంస్థ కలుగజేసుకుని వాటికి వైద్యం అందించిన రోజులు కూడా ఉన్నాయి. గోవుల మీద ప్రేమతో దుకాణాల యజమానులు గోవులకు ఆహారం, గడ్డికి బదులు పిండి, కూరగాయలు వంటివి అరకొర పెట్టడం వలన కూడా గోవులు జబ్బుపడుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీటికంతటికి కారణం ఒకటే.. కేవలం ఆవుల యజమానులు పట్టించుకొనకపోవడమే. గర్భం దాల్చిన ఆవుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అవి పలు సందర్భాల్లో నరకం చూస్తున్నాయి. ఆవులను ఊరి బయటకు తరలించాలని మున్సిపల్ అధికారులు గతంలో వాటి యజమానులకు తాఖీదులు జారీ చేశారు. అయినా వారు ఏమాత్రం ఖాతరు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఆవులు అనారోగ్యపాలు కాకుండా ఉండేందుకు గోశాలకు తరలించేలా అధికారులు కృషి చేస్తారని ఆశిద్దాం.










