Oct 18,2022 23:36

ర్యాలీ చేపడుతున పోలీసులు, ఆటో డ్రైవర్లు

ప్రజాశక్తి-అరకులోయ రూరల్‌:వాహన ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్క వాహన చోదకులు సహకరించాలని సిఐ జి.దేముడుబాబు కోరారు. అరకులోయ పోలీస్‌ స్టేషన్లో ఆటో డ్రైవర్లకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్‌ స్టేషన్‌ నుండి తహసిల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అరకు సర్కిల్‌ ఇన్స్పెక్టర్‌ జి దేముడు బాబు మాట్లాడారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని, మితిమీరిన వేగంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని తెలిపారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడుపరాదన్నారు. శిక్షణ పొందని, లైసెన్స్‌ లేని వ్యక్తులు వాహనాలు నడిపి ప్రమాదాలు సంభవిస్తే అటు ప్రయాణికులు, ఇటు వాహనచోదకులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆటో యూనియన్‌ నాయకులు, సభ్యులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది పోలీసులు సూచించిన సూచనలు పాటించలేదన్నారు.అటువంటి వారి పట్ల తమ శాఖ కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. అనంతరం పద్మాపురం పంచాయతీ రణజిల్లడ గ్రామంలో సిఐ, తహసిల్దార్‌ వేణుగోపాల్‌, మండల పరిషత్‌ అధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ముడనమ్మకాలపై ఆపరేషన్‌ పరివర్తనలో భాగంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆటోడ్రైవర్లు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.