Jul 25,2023 22:32

రికార్డులను పరిశీలిస్తున్న ఎస్‌పి రాధిక

ప్రజాశక్తి - టెక్కలి రూరల్‌ : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్‌పి జి.ఆర్‌ రాధిక అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా టెక్కలి డిఎస్‌పి కార్యాలయాన్ని మంగళవారం సందర్శించి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా పోలీసుల గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని సేకరించాలన్నారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. గంజాయి, గుట్కా, ఖైనీ తదితర నిషేధిత పదార్థాల రవాణా, విక్రయాలపై దృష్టిసారించాలన్నారు. పాత కేసుల్లో ముద్దాయిలపై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. నేర నియంత్రణ నిరంతర గస్తీ నిర్వహించాలన్నారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టెక్కలి డిఎస్‌పి డి.బాలచంద్రారెడ్డి, సిఐ సూర్య చంద్రమౌళి, ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.