టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఆంజనేయులు
ప్రజాశక్తి-విజయవాడ
సింగ్‌నగర్ ప్లైఓవర్‌పై పెరిగిన ట్రాఫిక్ రద్దీ వలన తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వీటి నివారణకు ప్లైఓవర్ పక్కనే మరొక ప్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని టాక్స్‌పేయర్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎంవి ఆంజనేయులు కోరారు. స్థానిక బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ పై ట్రాపిక్ రద్దీని తగ్గించటం కోసం ప్రస్తుత ఫ్లైఓవర్ ప్రక్కనే మరో ఫ్లైఓవర్ నిర్మించాలని కోరుతూ తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ డిల్లీరావుకు శుక్రవారం వినతిపత్రం అందజేశామన్నారు. రైల్వే ట్రాక్‌కు ఉత్తరం వైపున ఉన్న సింగ్ నగర్, వాంబే కాలనీ, కండ్రిక, పాయకాపురం, ఉడా కాలనీ, రాజీవ్ నగర్, సుందరయ్యనగర్, శాంతినగర్, న్యూ రాజరాజేశ్వరీపేట. నందమూరినగర్, ఆంధ్రప్రభ కాలనీ, తదితర ఏరియాలన్నింటిలో కలిపి లక్షన్నర మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారని, వీరందరూ సిటీలోకి వెళ్లాలంటే ఈ ఫ్లైఓవర్ మీదుగా మాత్రమే వెళ్లాల్సి ఉందని పేర్కొన్నారు. సిటీ పరిధిలోని ఈ ప్రాంతాలతోబాటుగా నున్న, పాతపాడు, మంగళాపురం, ఆగిరిపల్లి, తదితర ప్రాంతాలనుండి ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, సిటీ బస్సులు, స్కూలు, కాలేజి బస్సులు, చెత్తతరలించే మున్సిపల్ వాహనాలు, నూజివీడు, సత్తుపల్లి ప్రాంతాల నుండి ఆర్‌టీసి బస్సులు, ఇతర వాహనాలు వేలాదిగా ప్రతి రోజూ ఈ ఫ్లైఓవర్ మీదుగానే ప్రయాణించటంతో ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ రద్దీ పెరిగిందని అన్నారు. ఫ్లైఓవర్ రెండు లైన్లదే కావటంతో ట్రాపిక్ జామ్‌లు నిత్యకృత్య మయ్యా యని, దాదాపు ప్రతిరోజూ చిన్నవో పెద్దవో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదాల నివారణకు ఆ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై మరో ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ తొలగించి, దానిస్థానంలో 4 లేదా 6 లైన్ల ఫ్లైఓవర్‌ను నిర్మించటం, లేదా ఇప్పుడు ఉన్న ఫ్లైఓవర్ ను ఆనుకొని మరో రెండు లైన్ల ఫ్లైఓవర్ ను నిర్మించటం, ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్‌కు పశ్చిమాన డాబా కొట్ల సెంటర్ నుండి ప్రారంభించి రైల్వే ట్రాక్ మీదుగా ఫ్రూట్ మార్కెట్ రోడ్డు వైపుకు చేరేవిధంగా మరో ఫ్లైఓవర్‌ను నిర్మించటం వంటి మూడు ప్రత్యమ్నాయ మార్గాల ఏర్పాటుపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించి, కార్యాచరణకు పూనుకోవాలని కోరారు. పెరిగిన ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, డాబా కొట్ల సెంటర్‌నుండి రైల్వే ట్రాక్ మీదుగా మరో ఫ్లైఓవర్‌ను సత్వరమే నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు విఎస్ రామరాజు పాల్గొన్నారు.










