Jul 27,2023 00:41

చింతూరు మండలం కొయగురు వాగు పొంగి రోడ్డుపై ప్రవహిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-చింతూరు
గోదావరి వరద నీటి ప్రవాహం మళ్లీ పెరిగింది. 10,12,804 క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మంగళవారం 38.1 అడుగులు ఉండగా, బుధవారం సాయంత్రానికి 46.2 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటి ప్రవాహం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరుకుంటే రెండవ ప్రమాద హెచ్చరికను, 53 అడుగులకు పెరిగితే మూడో ప్రమాదక హెచ్చరికను జారీ చేస్తామని సిడబ్ల్యూఎస్‌ అధికారులు తెలిపారు. మరో వైపు చింతూరు వద్ద శబరి నది నీటి మట్టం కూడా పెరిగింది. మంగళవారం 26 అడుగులున్న శబరి నీటి మట్టం బుధవారం సాయంత్రానికి క్రమంగా పెరుగుతూ 32 అడుగులకు చేరింది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం కారణంగా చింతూరు ఏజెన్సీలో గత 24 గంటల నుండి కుండ పోత వర్షం కురుస్తోంది. దీంతో మండలంలోని సోకిలేరు, చంద్రవంక, కొయగురు, చీకటి వాగు తదితర వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులను మూసుకుపోయాయి. కొయగూరు వాగు రోడ్డుపై ప్రవహించడంతో ఆంధ్ర -ఒడిశా రహదారులు స్తంభించాయి. కొమ్మూరు వద్ద చంద్రవంక వాగు పొంగి ప్రవహించడంతో కొమ్మూరు-మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. సోకిలేరు వాగు ప్రవాహం వల్ల విఆర్‌.పురం, చింతూరు మండలాలకు సంబంధాలు తెగిపోయాయి. బుధవారం చింతూరు మండల కేంద్రంలో వారపు సంత జనం లేక వెలవెల పోయింది. కొయగూరు వాగు దాటుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకోగా స్థానికుల సహాయంతో బయటకు తీశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఇంకా ప్రమాద స్థాయిలో వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చింతూరు పంచాయతీ అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు చేశారు.
ఎటపాక : గోదావరి వరద ఉధృతి పెరుగుతుండడంతో పరివాహక ప్రాంతం ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే వరద ప్రవాహం కారణంగా మురుమూరుకు, భద్రాచలం - కూనవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరితే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టులు నుండి విడుదల చేస్తున్న వరద నీరు భారీగా వచ్చి గోదావరి నదిలో చేరుతుందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. మరో వైపు గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు, కుంటలు నిండు కుండలా మారాయి. వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మిగిలిన ప్రాంతాల్లో వారం రోజుల వరకు చెరువులలో నీళ్లు లేక ఈ ఏడాది వరి పండించగలమో లేదో అనే సందిగ్ధంలో ఉన్న రైతన్నలు చెరువులు అలుగు పారుతుండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విఆర్‌.పురం : కూనవరం వద్ద శబరి నీటి మట్టం 36.88 అడుగులకు చేరింది. గోదావరి వరద పెరుగుతుండడంతో ప్రజలు భయం గుప్పెట్లో ఉన్నారు. భారీ వర్షాల వల్ల అన్నవరం, అడివి వెంకన్నగూడెం వాగులు పొంగి 40 గ్రామాలకు రాకపోకల నిలిచిపోయాయి. తృష్టి వారి గూడెం, అడివి వెంకన్న గూడెం, కన్నాయిగూడెం, శ్రీరామగిరి సీతంపేట మధ్య రాకపోకలు స్తంభించాయి.
సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి : తహశీల్దారు
విఆర్‌.పురం : భారీ వర్షాలు, వరద ఉధృతి నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ముందస్తుగా లోతట్టు ప్రాంతాలైన ఒడ్డుగూడెం, ఒడ్డుగూడెం కాలనీ ప్రజలతో తహశీల్దారు ఎన్‌.శ్రీధర్‌, విఆర్‌.పురం ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ మాట్లాడారు. గోదావరి, శబరి నదులు గురువారం నాటికి 60 అడుగులు వచ్చే అవకాశం ఉందని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.