Sep 22,2023 01:15

ప్రజాశక్తి - రేపల్లె
వినాయక నిమజ్జనంలో అధికారులు వైపల్యం వల్ల చనిపోయిన ఇద్దరి కుటుంబాలను ఆదుకోవాలి, ఆ కుటుంబాలకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలనీ సీపీఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. మండలంలో వినాయక విగ్రహాల నిమజ్జనం చేస్తున్న పెనుమూడి నదివద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అధికారాలు వైపల్యం వల్ల ప్రమాదంలో చనిపోయిన పడమటి విజయకుమార్, కొండేటి వెంకటేశ్వరరావు కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ తహసిల్దారు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్‌కు గురువారం వినతి పత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాల పెనుమూడి వద్ద వినాయక చవితి సదర్భంగా నిమజ్జనాలు చేస్తున్నారని అన్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారని తెలిపారు. రేపల్లెతోపాటు నగరం, నిజాంపట్నం, భట్టిప్రోలు, చెరుకుపల్లి మండలాల నుండి కూడా పెనుమూడి వద్దనే నిమజ్జనాలు చేస్తుంటారని తెలిపారు. గతంలో తహశీల్దారు పర్యవేక్షణలో రెవిన్యూ, పోలీస్, పంచాయితీ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉండేవారని తెలిపారు. ప్రస్తుతం ఎటువంటి మందస్తు జాగ్రత్తలు, ప్రణాళిక ప్రకారం లేకపోవటం వల్లనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రెండు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిపియం నాయకులు వై కిషోర్, కె అశ్విరాధం, కె రమేష్, ఆగస్టిన్, వి తులసిరాముడు, ఎం వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.