కోవిడ్ మహమ్మారితో ఛిద్రమైన బతుకులను అధిక ధరలు మరింతగా కుంగదీస్తున్నాయి. పండ్లు, కాయగూరలు, వంటనూనెలు, దుస్తులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌తో సహా అన్ని రకాల సరుకుల ధరలు నింగినంటుతుండడంతో సగటు జీవి విలవిలలాడుతున్నాడు. ఈ ఏడాది అయినా ధరల దరువు నుంచి ఊరట లభిస్తుందేమోనని ఆశించినవారికి తాజా ద్రవ్యోల్బణ ధోరణులు మరింత గుబులు పుట్టించేలా ఉన్నాయి. ఆర్‌బిఐ అధికారికంగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 2022 జనవరిలో రిటైల్ ధరల సూచి 6.01 శాతం పెరిగి, ఏడు నెలల గరిష్టానికి చేరుకుంది. 2021 డిసెంబరులో ఇది 5.66 శాతంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో కన్నా గ్రామీణ భారతంలో అధిక ధరల సమస్య మరీ ఎక్కువగా ఉంది. వినియోగ దారుల ధరల సూచి డిసెంబరులో 4.5 శాతం వుండగా, జనవరిలో 5.43 శాతానికి పెరిగింది. 2022లో ద్రవ్యోల్బణం 4 శాతానికి మించదని ఆర్‌బిఐ గవర్నరు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితికి ఎక్కడా లంకె కుదరడం లేదు. దాదాపు అన్ని రాష్ట్రాలు 6 శాతం కన్నా అధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేశాయి. హర్యానాలో ద్రవ్యోల్బణం 7 శాతం దాటేసింది. అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్రమాద ఘంటికగా పరిగణించాల్సిన అవసరం లేదన్నట్టు ఆర్‌బిఐ గవర్నరు శక్తికాంత దాస్ మాట్లాడుతున్నారు. 2022 తొలి త్రైమాసికంలో కొంత పెరిగినా, తరువాత తగ్గుతుందని ఆర్‌బిఐ గవర్నరు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్ 95 డాలర్లకి చేరుకుంది. ఇప్పటికే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధర లీటర్ వంద రూపాయలు దాటింది. వంటగ్యాస్ సబ్సిడీ సిలిండర్ ధర రూ. 900 - రూ.1,000 మధ్య ఉంది. ఈ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ పెట్రో ధరల మోత మోగించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ ఎక్సైజు సుంకాలు, సెస్సులు, సర్‌ఛార్జీల పేరుతో పెట్రో ఉత్పత్తులపై విపరీతంగా పన్నులు పెంచింది. 2018-2021 మధ్య కాలంలో పెట్రో ఉత్పత్తులపై కేంద్రం పన్నుల ద్వారా 8.2 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా పార్లమెంటుకు తెలియజేశారు. మరో వైపు సుదీర్ఘంగా కొనసాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభం అమెరికా దుందుడుకు వైఖరి వల్ల యుద్ధానికి దారి తీస్తే క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే ప్రమాదముంది. చమురు ధరలు పెరగడం వల్ల రవాణా రంగంతో సహా ఇతర అన్ని రంగాల ఇన్‌పుట్స్ ధరలకు రెక్కలొస్తాయి. దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాలతోబాటు పట్ణణ ప్రాంతాలపైనా తీవ్రంగా ఉంటుంది. కరోనా లాక్‌డౌన్లు, ఆంక్షల మూలంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయి పేదరికంలోకి నెట్టబడ్డారు. ప్రజల చేతిలో కొనుగోలు శక్తి పడిపోయింది. ఫలితంగా మార్కెట్‌లో సరుకులు ఉన్నా వినియోగదారుల నిజ ఆదాయాలు పడిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత నెలకొంది. ఈ సమయంలో ప్రజల పట్ల బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన పని ఉద్యోగాల కల్పన, ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకు నేరుగా డబ్బు అందేలా చర్యలు చేపట్టాలి. కానీ, మోడీ ప్రభుత్వ ప్రాధాన్యతలే వేరు. ప్రజల ప్రయోజనాల కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలే దానికి ముఖ్యం. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. ఉపాధి హామీకి నిధులు పాతిక వేల కోట్ల మేర కోత పెట్టింది. ఆకలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఆహార భద్రత చట్టం కింద ఇవ్వాల్సిన ఆహార సబ్సిడీని 30 శాతం తగ్గించింది. పెరిగిన ఇంధన ధరలకు అనుగుణంగా ఎరువుల సబ్సిడీలకు కేటాయింపులు పెంచవలసింది పోయి 25 శాతం మేర కోత పెట్టింది. మధ్యాహ్న భోజన పథకానికి వాతలు తప్పలేదు. అదే సమయంలో కార్పొరేట్లు ఆర్జించే సూపర్ లాభాలపై పన్ను విధించేందుకు ఆర్థిక మంత్రి తిరస్కరించారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసి, ప్రజలకు ధరల దరువు నుంచి ఉపశమనం కలిగించాలన్న ఆలోచన ఈషణ్మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించడం లేదు. ప్రజలు పడుతున్న ఈ బాధల నుంచి దృష్టి మళ్లించేందుకు మతతత్వ ఎజెండాను బిజెపి తెలివిగా ముందుకు తెస్తోంది. ఈ ముదనష్టపు ప్రభుత్వాన్ని ఎంత త్వరగా సాగనంపితే దేశానికి అంత శ్రేయస్కరం.










