వాతావరణ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర్గత ప్రభుత్వ కమిటీ (ఐపిసిసి) నివేదిక ఆందోళనకర అంశాలు వెల్లడించింది. ఒక్క మాటలో 'మానవాళికి ఇది రుధిర సంకేతం'గా పేర్కొని ఇప్పటికైనా అప్రమత్తం కాకపోతే పెను ముప్పు తప్పదని హెచ్చరించింది. గ్లోబల్ వార్మింగ్ వలన వందేళ్లకోసారి సముద్ర మట్టం పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు ఈ శతాబ్దం చివరిలో ఆరంభమై ఏటా సంభవిస్తాయని ఐపిసిసి పేర్కొంది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుంది. భూతాపం 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగితే తీవ్ర వేడి గాలులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గడం వంటివి సంభవిస్తాయి. ఉష్ణోగ్రతలు 2 డిగ్రీ సెంటిగ్రేడ్ మార్కు దాటితే ప్రభావం తీవ్రమై వ్యవసాయంపైనా, ఆరోగ్యంపైన పెను ప్రమాదం తప్పదు. జీవితాలు, జీవనోపాధులు నాశనమవుతాయి. ప్రస్తుత ప్రభావాన్ని బట్టి యాభై ఏళ్లకోమారు నమోదయ్యే తీవ్ర ఉష్ణోగ్రతలు, వడ గాలులు పదేళ్లకే నమోదవుతున్నాయి. భూతాపం కనుక ఒక డిగ్రీ మేర పెరిగినట్లయితే ప్రతి ఏడేళ్లకూ రెండుసార్లు ఉంటుంది. భూమి వేడెక్కడం ఇలాగే కొనసాగితే 2030 నాటికి 1.5 డిగ్రీల హద్దును దాటేస్తుందన్నది ఐపిసిసి మోగించిన ప్రమాద ఘంటిక. గట్టి చర్యలు తీసుకోకపోతే కట్టడి చేయలేని స్థాయికి భూతాపం చేరుతుందని, తగ్గడానికి 20 నుండి 30 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది.
ప్రపంచంలోకెల్ల మన దేశమే భూతాపం ప్రభావాన్ని అధికంగా ఎదుర్కొంటుందనడం మనకు బెంబేలెత్తించే అంశం. తతిమ్మా సముద్రాల కంటే హిందూ మహాసముద్రమే ఎక్కువగా వేడెక్కుతోందని, విపత్తులు భీకరంగా ఉంటాయని ఐపిసిసి నివేదిక ప్రత్యేకంగా నొక్కి చెప్పింది. ఆందోళనకర స్థాయిలో ఉష్ణోగ్రతలు, వర్షపాతం, వరదలు తప్పవని స్పష్టం చేసింది. రాబోయే పదేళ్లల్లో కరువు, వడగాలులు, కార్చిచ్చులు, తుపాన్లు, మరింత వేగంగా, తీవ్రంగా, విస్తృతంగా ఉంటాయని హెచ్చరించింది. నిజానికి ఇప్పటికే మన దేశం ఊహించని అతి భారీ విపత్తులను ఇటీవలి కాలంలో తరచు చవి చూస్తోంది. ఉన్నపళంగా కుంభవృష్టి కురుస్తోంది. నదులు ఉప్పొంగుతున్నాయి. అంతలోనే తట్టుకోలేని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రుతుపవనాలు గతి తప్పుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి రెండూ ఏకకాలంలో కలిసే విరుచుకుపడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ వలన ఎక్కడో ధృవాల్లోనే కాదు మన చెంతనున్న హిమాలయాలూ కరుగుతున్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు నెత్తీనోరు బాదుకుంటునే ఉన్నారు. ఇప్పుడు ఐపిసిసి నివేదిక సైతం అంతుబట్టని విపత్తులకు కారణమేంటో శాస్త్రీయ అధ్యయనం ద్వారా జాగరూకత కల్పించింది.
భూమి వేడెక్కుతోందని గుర్తించి కొన్ని దశాబ్దాలవుతోంది. భూతాపం మానవులు చేజేతులా చేస్తున్న చర్యల పర్యవసానమని ఎప్పుడో నిర్ధారణ అయింది. కాకపోతే, ఆ చర్యల కట్టడి బాధ్యత ఎవరిది ఎంత అనే దగ్గరే సమస్య. ఆర్థిక ఆధిపత్య దేశాల ఏకపక్ష స్వార్ధపూరిత విధానాలే సమస్య జఠిలం కావడానికి హేతువు. ఆ దిశగా పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి సాగనంత వరకు ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని తడవలు ఒప్పందాలు చేసుకున్నా పరిస్థితిలో మార్పు ఉండదు. ఇదే ఐపిసిసి నివేదిక నొక్కివక్కాణించిన హేతుబద్ధ స్పష్టీకరణ. ఒకటిన్నర శతాబ్దాల కాలంలో భూతాపం 1.1 డిగ్రీలు పెరగగా వచ్చే తొమ్మిదేళ్లలో 1.5 డిగ్రీలకు చేరడం సులభమే. వాతావరణ మార్పులపై జరిగిన ప్యారిస్ ఒప్పందంలో 1.5 డిగ్రీలు తగ్గించాలని లక్ష్య నిర్దేశం జరిగింది. ఐదేళ్లలో ఆచరణ దాదాపు శూన్యం. మార్కెట్ శక్తులకు తలొగ్గిన అభివృద్ధి చెందిన దేశాలు బొగ్గు, శిలాజ ఇంధనాల వాడకాలను, కార్బన్, ఇతర గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించలేదు. సమకూరుస్తామన్న నిధులు సమకూర్చలేదు. ఐపిసిసి నివేదిక ఈ ఏడాది నవంబర్‌లో వాతావరణ మార్పులపై గ్లాస్గోలో నిర్వహించే అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు దిక్సూచి కావాలి. అభివృద్ధి చెందిన దేశాలు ఉద్గారాలను లక్ష్యాలకనుగుణంగా తగ్గించుకోవాలి. అవసరమైన నిధులను, టెక్నాలజీని బదిలీ చేయాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ఉద్గారాల తగ్గుదలకు తాము పూచీ పడి, సామ్రాజ్యవాద దేశాలను కలిసికట్టుగా నిలదీయాలి. గ్లోబల్ వార్మింగ్‌ను అధికంగా ఎదుర్కొనే భారత్ ముందుండాలి.










